DK Shivakumar On KCR : కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ సంప్రదిస్తున్నారు - డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Telangana Assembly Elections 2023 : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా… కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ సంప్రదిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు.
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో… కాంగ్రెస్ అప్రమత్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగిల్ గానే అధికారంలోకి వస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్న ఆ పార్టీ,.. సమీకరణాలు మారితే ఏం చేయాలనే దానిపై కూడా ప్లాన్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో ANIతో మాట్లాడిన ఆయన… మా పార్టీ అభ్యర్థులను కేసీఆర్ సంప్రదిస్తున్నట్లు సమాచారం ఉందని చెప్పారు.
“మమ్మల్ని ట్రాప్ చేసేందుకు వాళ్లు (బీఆర్‌ఎస్) ప్రయత్నిస్తున్నారని మాకు తెలుసు. తమను సీఎం (కేసీఆర్) స్వయంగా సంప్రదించారని మా అభ్యర్థులు మాకు తెలియజేశారు. మా అభ్యర్థులే స్వయంగా చెప్పటంతో మాకు సమాచారం ఉంది” అని డీకే శివకుమార్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో మెజారిటీ సాధిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు డీకే శివకుమార్. “ఇది నా పార్టీ పని కాబట్టి నేను అక్కడికి వెళుతున్నాను. కర్ణాటక ఎన్నికల సమయంలో తెలంగాణ టీమ్ మొత్తం ఇక్కడే మాతో ఉన్నారు. అందుకే నేను కూడా వెళ్తున్నాను. ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇబ్బంది లేదు, ఎలాంటి ముప్పు లేదు. మాకు విశ్వాసం ఉంది. మా పార్టీ సునాయాసంగా గెలుస్తుంది”అని అన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ లోకి వస్తామంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని చెప్పారు.
"వారు (బీఆర్‌ఎస్) గతసారి మా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ మా పార్టీలోకి వచ్చేందుకు మా నేతలోతా పాటు నాకు కూడా కాల్స్ వస్తున్నాయి. వారు మాతో చేరడానికి సిద్ధంగా ఉన్నారని… దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వారు తమ నాయకులను కోల్పోకుండా జాగ్రత్త వహించుకోవాలని ”అంటూ రేణుకా చౌదరి ANI కి చెప్పారు.