MLA Candidates Assets: ఆ ఎమ్మెల్యేలకు భారీగా పెరిగిన ఆస్తులు.. ఏడిఆర్‌ రిపోర్ట్‌-a huge increase in assets of mla candidates contesting for the second time has been recorded ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mla Candidates Assets: ఆ ఎమ్మెల్యేలకు భారీగా పెరిగిన ఆస్తులు.. ఏడిఆర్‌ రిపోర్ట్‌

MLA Candidates Assets: ఆ ఎమ్మెల్యేలకు భారీగా పెరిగిన ఆస్తులు.. ఏడిఆర్‌ రిపోర్ట్‌

Sarath Chandra HT Telugu
Nov 27, 2023 12:08 PM IST

MLA Candidates Assets: పార్టీలు ఏవైనా రెండోసారి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తుల్లో మాత్రం భారీగా పెరుగుదల నమోదైంది. తెలంగాణలో అన్ని పార్టీల నుంచి రెండోసారి పోటీ చేస్తున్న 103మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువలో గణనీయంగా పెరుగదల నమోదైనట్లు ఏడిఆర్‌ నివేదిక పేర్కొంది.

భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తుల విలువ
భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తుల విలువ

MLA Candidates Assets: అధికార పార్టీ, ప్రతిపక్షాలు అనే తేడా లేదు. ప్రజా ప్రతినిధిగా ఓసారి ఎన్నికై రెండోసారి ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల ఆస్తుల గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2018తో పోలిస్తే 2023లో పోటీ చేస్తున్న 103మంది అభ్యర్థుల ఆస్తుల్లో భారీ వ్యత్యాసాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది.

తెలంగాణ ఎలక్షన్ వాచ్ 2023 పేరిట వెలువరించిన నివేదికలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తున్న 103 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఆస్తుల విలువ విశ్లేషించారు. 2018లో గెలిచి తిరిగి పోటీ చేసిన 103 మంది ఎమ్మెల్యేలలో 90 మంది ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగాయి. వీరి ఆస్తుల నికర విలువ 3% నుండి 1331% వరకు పెరిగింది. 13 మంది ఎమ్మెల్యేల (13%) ఆస్తుల విలువ మాత్రం -1% నుండి -79% వరకు తగ్గుదల నమోదైంది.

2018లో స్వతంత్రులతో సహా వివిధ పార్టీలు తిరిగి పోటీ చేసిన 103 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ. 14.44 కోట్లుగా ఉంది. 2023లో తిరిగి పోటీ చేస్తున్న ఈ 103 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 23.87 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు.

5 సంవత్సరాలలో సగటు ఆస్తుల వృద్ధి (2018-2023 మధ్యకాలంలో) భారీగా పెరిగింది. 2018 మరియు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మధ్య 103 మంది తిరిగి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.9.43 కోట్ల మేరకు సగటున వృద్ధి చెందింది.

అత్యధికంగా పైళ్ల శేఖర్ రెడ్డి….

103 మంది తిరిగి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేల ఆస్తుల సగటు విలువ 65%పెరిగింది. భువనిగిరి నియోజకవర్గానికి చెందిన బిఆర్‌ఎస్‌కు చెందిన పైళ్ల శేఖర్ రెడ్డి గరిష్టంగా ఐదేళ్లలో రూ. 136.47 కోట్లతో ఆస్తులు పెంచుకున్నట్లు ప్రకటించారు. 2018లో రూ. 91.04 కోట్ల నుంచి రూ. 2023లో 227.51 కోట్లకు శేఖర్‌ రెడ్డి ఆస్తులు పెరిగాయి.

దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌కు చెందిన ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి ఆస్తులు రూ.59.02 కోట్లు, 2018లో రూ.20.15 కోట్ల నుంచి 2023లో రూ.79.17 కోట్లకు పెరిగాయి.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆస్తులు రూ.52.59 కోట్లు, 2018లో రూ.7.99 కోట్ల నుంచి 2023లో రూ.60.58 కోట్లకు పెరిగాయి.

భువనగిరి నుంచి పోటీ చేస్తున్న పైళ్ల శేఖర్‌ రెడ్డి ఆస్తులు 150శాతం పెరుగుదల నమోదు చేశాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.91కోట్లుగా ఉన్న శేఖర్‌ రెడ్డి ఆస్తులు తాజా అఫిడవిట్‌లో రూ.227కోట్లకు చేరాయి. వ్యాపారం,వ్యవసాయం, ఇతర ఆదాయ వనరుల ద్వారా ఆదాయం సమకూరినట్టు పేర్కొన్నారు.వృ

మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న చమకూర మల్లారెడ్డి ఆస్తులు 95శాతం పెరిగాయి. 46కోట్ల రుపాయల ఆస్తులు ఐదేళ్లలో సమకూరాయి. 2018లో రూ.49కోట్లుగా ఉన్న మల్లారెడ్డి ఆదాయం 2023లో రూ.95కోట్లకు పెరిగింది.

నారాయణ పేటలో బిఆర్‌ఎస్‌ తరపున రెండో సారి పోటీ చేస్తున్న రాజేందర్ రెడ్డి ఆస్తులు68శాతం పెరిగాయి. కొత్తగా రూ.45కోట్ల ఆస్తులు వచ్చి చేరాయి. 2018లో రూ.66కోట్లుగా ఉన్న ఆదాయం 2023లో రూ.111కోట్లకు చేరింది.

2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో అన్ని పార్టీ అభ్యర్థుల ఆస్తుల విలువలో పెరుగుదల నమోదైంది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బిజెపిలకు చెందిన 103మంది అభ్యర్థుల ఆస్తుల విలువలో పెరుగుదల నమోదైంది.

90మంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.14-15కోట్ల రుపాయల నుంచి రూ.25కోట్లకు పెరిగింది. ఐదేళ్లలో రూ.10కోట్ల మేర ఆస్తులు అదనంగా సమకూర్చుకున్నారు. ఈ పెరుగుదల 68.56శాతంగా నమోదైంది.

అన్ని పార్టీల నేతలది అదే దారి….

ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.నాలుగు కోట్ల నుంచి రూ.6కోట్లకు పెరిగింది. కొత్తగా వీరంతా సగటున రూ.2కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారు.

నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువలో రూ.7కోట్ల పెరుగుదల నమోదైంది. 2018లో రూ.12కోట్లుగా ఉన్న ఆస్తుల విలువ రూ.19కోట్లకు చేరింది.

ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేల ఆస్తుల విలువలో రూ.2కోట్ల పెరుగుదల నమోదైంది. వీరి ఆస్తుల విలువ రూ.22కోట్ల నుంచి రూ.25కోట్లకు చేరింది.

మొత్తం 103మంద ఎమ్మెల్యేల ఆస్తుల విలువలో సగటున 65శాతం పెరుగుల నమోదైంది. సగటున ఒక్కొక్కరి ఆస్తుల విలువ రూ.14కోట్ల నుంచి రూ.9కోట్ల పెరుగుదలతో రూ.23కోట్లకు చేరాయి.

WhatsApp channel