Ponnam Prabhakar: పొన్నం కసరత్తు ఎవరి కోసం.. అభ్యర్థి ఎంపిక పై ఆసక్తికర చర్చ
Ponnam Prabhakar: కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ గెలుపుకోసం తన వంతు కృషి చేస్తున్నారు. అయితే అభ్యర్థిత్వంపై ఒకవైపు ఆసక్తికర చర్చ నడుస్తుండగా, మంత్రి బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు మరింత ఆసక్తికర వ్యాఖ్యానాలు వినిపించాయి.
కరీంనగర్ లోక్‌సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొనగా హై కమాండ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం తన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ప్రచారంలో రాజేందర్ రావు వెంట ఉన్నారు. రాజేందర్ రావు, డిసిసి అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి మంత్రి పొన్నం కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ తో ప్రచారం చేశారు.
ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడి షాట్లు కొట్టారు. ఫిజికల్ ఫిట్ నెస్ కోసం ఎక్సర్సైజ్ వర్క్ అవుట్స్ చేశారు. అయితే అభ్యర్థి ఎంపిక కోసం మంత్రి పొన్నం ‘కసరత్తు’ ఎవరికి మేలు చేయనుందోనంటూ స్థానికంగా ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
‘సర్దుబాటు చేసుకుంటాం’
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటలతో ప్రచారం సాగిస్తే కరీంనగర్ అభ్యర్థిగా భావిస్తున్న వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ లో 50 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఎంపిగా అవకాశం ఇస్తే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నేడో రేపో అధికారికంగా అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ని సంప్రదించి సర్దుబాటు చేసుకుంటామని, ముహుర్తం చూసుకుని రెండు రోజుల్లో నామినేషన్ వేస్తానని రాజేందర్ రావు తెలిపారు.
బోగస్ గాళ్ళు..బోగస్ మాటలు: పొన్నం
బీఆర్ఎస్ బీజేపిలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీల నేతలు అన్నదమ్ముల్లా కూడబలుక్కుని మాట్లాడుతున్నారని విమర్శించారు. బోగస్ గాళ్ళే బోగస్ మాటలు చెబుతారని బండి సంజయ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 వరకు రెండు లక్షల రైతు రుణమాఫీ పెద్ద బోగస్ అని బండి సంజయ్ చేసిన విమర్శలపై పొన్నం ఘాటుగా స్పందించారు.
ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతులని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనే కేసిఆర్ మాటలను పగటి కలగా కొట్టిపారేశారు.
తల్లి పేరుతో రాజకీయాలా?
తల్లి పేరుతో కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఓసారి భార్య పుస్తెలతో మరోసారి తల్లి పేరుతో ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికి తెలుసన్నారు. రాముడు అందరివాడు.. అందరు ఆరాదిస్తారు.. దమ్ముంటే మోడీ ఫోటోతో ఓట్లు అడుగాలని డిమాండ్ చేశారు.
వ్యక్తిగత విమర్శలకు తావులేదన్న పొన్నం, అభివృద్ధి పై తాను ఎంపిగా ఉన్నప్పుడు ఏం చేశాను గత ఐదేళ్ళలో బండి సంజయ్ చేసింది ఏమిటో చర్చించేందుకు సిద్దం గా ఉన్నానని తెలిపారు. ఫిజికల్ ఫిట్ నెస్ మెంటల్ పిట్ నెస్ తో ఉన్నానని ఎక్కడికి అంటే అక్కడ వస్తానని స్పష్టం చేశారు.
బీజేపీ విషం చిమ్ముతుంది..
దక్షిణ భారత్ పై మోదీ, బిజేపి నేతలు విషం కక్కుతున్నారని పొన్నం ఆరోపించారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే మన రాష్ట్రానికి రావాల్సిన హక్కును లెక్కలో చూపుతున్నారని విమర్శించారు.అన్ని రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రానికి రోటిన్ గా వచ్చేదాన్ని కిషన్ రెడ్డి లెక్కలు చూపడం అవివేకమన్నారు.
కరీంనగర్ లో అగ్గి నిప్పు అనుకునే బండి సంజయ్ గంగుల కమలాకర్ కలిసి ఉన్నారని తెలిపారు. బండి సంజయ్ గంగుల కమలాకర్ ఇద్దరు స్నేహితులని, గత ఎన్నికల్లో వినోద్ కుమార్ ను ఓడించేందుకు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. పెదప్రజల భూములు గుంజుకున్న వారిని వదిలిపెట్టమని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 75 వేల కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చిందని, ఎన్నికల కోడ్ అనంతరం అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అక్రమ దందాలకు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయండి అని పొన్నం ప్రభాకర్ కోరారు.
- కేవీ రెడ్డి, హెచ్‌టీ కరస్పాండెంట్, కరీంనగర్
సంబంధిత కథనం