EC Bans KCR Campaign :కేసీఆర్ కు షాకిచ్చిన ఈసీ, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం
EC Bans KCR Campaign : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది.
EC Bans KCR Campaign : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కు ఈసీ(EC) షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం(KCR Campaign Ban) చేయకుండా నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధిస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై కేసీఆర్(KCR) అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన ఈసీ కేసీఆర్ పై చర్యలు తీసుకుంది. ఈ 48 గంటలు కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం చెందింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర చేపడుతున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఓటమి తర్వాత ప్రత్యర్థులపై కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు మాటల దాడి మొదలుపెట్టారు. కేసీఆర్ అయితే మరో ముందడుగు వేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు
ఈసీ నిషేధంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. తన మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. తెలంగాణ మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను మాత్రమే ఎంపిక చేసుకుని ఈసీ(EC)కి ఫిర్యాదు చేశారన్నారు. తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదన్న కేసీఆర్... కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే తాను ప్రస్తావించానని కేసీఆర్ తెలిపారు.
మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా?
ఇదెక్కడి అరాచకం, ఏకంగా తెలంగాణ ఆవాజ్ కేసీఆర్(KCR) గొంతు పైనే నిషేధమా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో వేదికగా ఈసీ నిర్ణయం(EC Bans KCR campaign)పై అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ (Modi)విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని మండిపట్టారు. బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్రే ఇదంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ బస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ వణికిపోతున్నాయన్నారు.
కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ సభలకు వస్తున్న మద్దతును చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడిపోతున్నాయని అంటున్నారు. అందుకే ఈసీ మద్దతుతో కేసీఆర్ ను కట్టడి చేయాలని చూస్తున్నాయని విమర్శించారు.
సంబంధిత కథనం