Opinion: దళితుల దయ కోల్పోతే అంతే!
‘2024 ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి పెంచుకున్న బలం, ఎన్డీయే బలం రమారమి తగ్గిన వైనం. దీని వెనుక.. ‘దళిత’కారకం దాగి ఉంది. దాన్ని వివిధ సర్వేలు నిజమని గణాంకాలతో నిగ్గుతేల్చాయి..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి, పొలిటికల్ అనలిస్ట్ దిలీప్ రెడ్డి విశ్లేషణ.
దళితులది ఈ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర. అందుకే రాజకీయపక్షాలు తగు ప్రాధాన్యతనిస్తుంటాయి. బహుళ సంఖ్యాకులైన దళితవర్గాలను అలక్ష్యం, నిర్లక్ష్యం చేసినపుడు.. ఆ మేరకు పార్టీలు నష్టపోతుంటాయి. కులాల బలాలను బట్టే రాజకీయాల్లో గెలుపోటములుంటే, సుదీర్ఘకాలం పాలించిన ఈ దేశ ప్రధానిగా ఏ కాన్షీరామో, జగ్జీవన్రామో, మరే మాయావతో ఉండాలి, మరలా ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. నిజమే, అలా ఉండదు. కానీ, దళితులు పెద్ద సంఖ్యలో ఎటు మొగ్గితే అటు గెలుపు వరించిన సందర్భాలు, లేదా ప్రత్యర్థుల ఆధిపత్యాల్ని నేలకు దించిన దాఖలాలు కోకొల్లలు. అలాంటిదే, 2024 ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి పెంచుకున్న బలం, ఎన్డీయే బలం రమారమి తగ్గిన వైనం. దీని వెనుక.. ‘దళిత’కారకం దాగి ఉంది. దాన్ని వివిధ సర్వేలు నిజమని గణాంకాలతో నిగ్గుతేల్చాయి.
వారిదే కీలకపాత్రం
అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో దళిత ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. వారి మొగ్గు మెజారిటీ స్థానాల్లో నిర్ణయాత్మకంగా మారే అవకాశాలున్నాయి. అప్పుడు పార్టీల అదృష్ట రేఖలే మారవచ్చు! అసెంబ్లీల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాలు హర్యానాలో 17/90, జార్ఖండ్లో 8/81, మహారాష్ట్రలో 28/288 ఉన్నాయి. ఆయా రిజర్వుడు స్థానాల్లోనే కాక రాష్ట్రమంతా విస్తరించి ఉండే ఇతర నియోజకవర్గాల్లోనూ బహుళ సంఖ్యాకులైన దళితులు ఏ పార్టీ వైపు మొగ్గినా మొత్తమ్మీద ఆయా పార్టీల/కూటముల విజయావకాశాలు మెరుగవుతాయి.
ఇప్పుడున్న వాతావరణం ఇదే పంథాలో సాగితే ఇండియా కూటమి లబ్ది పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చి చూస్తే ఇటీవలి 2024 ఎన్నికల నాటికి దళితుల మొగ్గు ఇండియా కూటమికి స్థూలంగా, కాంగ్రెస్‌కు నిర్దిష్టంగా ప్రయోజనం కలిగించింది. దేశవ్యాప్తంగా 80 ఎస్సీ రిజర్వుడు సీట్లుంటే ఈ సారి 20 చోట్ల కాంగ్రెస్ (2019లో 6 సీట్లు మాత్రమే) గెలుపొందింది. 33 ఎస్సీ రిజర్వుడు సీట్లు ఇండియా కూటమికి దక్కాయి.
బీజేపీ ఎస్సీ స్థానాల సంఖ్య ఈసారి 29 కి (2019లో 46) పడిపోగా, ఎన్డీయే గెలిచిన ఎస్సీ రిజర్వుడు స్థానాల సంఖ్య, 2019లో గెలిచిన 54 నుంచి 15 స్థానాలు తగ్గి, 39కి పడిపోయింది.
రిజర్వుడు స్థానాల్లో సంఖ్య హెచ్చు-తగ్గులు ఒక సంకేతం మాత్రమే! దళితులు రిజర్వు స్థానాలతో పాటు రిజర్వుకాని జనరల్ స్థానాల్లోనూ గణనీయ సంఖ్యలోనే ఉంటారు. వివిధ రాష్ట్రాల్లోని ఫలితాలను క్షణ్ణంగా పరిశీలించినపుడు బోధపడేది, ఇదొక ట్రెండ్! దళిత ఓటు వాటా శాతాల్లోనూ గణనీయమైన తగ్గుదల ఎన్డీయే కూటమికి నమోదైంది. కాంగ్రెస్ ఎస్సీ ఓటు శాతాన్ని కిందటి ఎన్నికల్లో పొందిన 16.7 శాతం నుంచి తాజా ఎన్నికల్లో 20.8 శాతానికి పెంచుకుంది.
ఈ మార్పు, తాను ఆధిక్యత సాధించిన, లేదా గట్టిగా పోటీ ఇచ్చిన రాష్ట్రాలలోనూ ప్రతిబింబించింది. ఈ గ్రాఫ్ ఇకపై అసెంబ్లీల ఎన్నికల్లో, మున్ముందు రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఊర్ద్వముఖంగానే ఉంటే కాంగ్రెస్, తద్వారా ఇండియా కూటమి పంట పండినట్లే! వాతావరణం వారికి సానుకూలంగా ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో విభిన్నంగా...
ఉత్తర్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఈ సారి దళితులు కాంగ్రెస్ పార్టీని ఎందుకో కరుణించారు. యూపీలో దశాబ్దాల తర్వాత, హర్యానాలో కనీసం పదేళ్ల తర్వాత దళితుల మొగ్గు వల్లే ఈసారి కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. మొత్తం దేశవ్యాప్తంగా చూసినపుడు ఇదివరకటి కంటే ‘ఇండియా’ విపక్ష కూటమివైపు దళితులు మొగ్గడం వల్లే వారికి అంచనాలకు మించి ఈ సారి లోక్‌సభ స్థానాలు లభించాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు 16 సర్వే సంస్థలు ఇండియా కూటమి సంఖ్య 150 దాటదు, అని తమ తమ సర్వే అంచనాల్లో వెల్లడించినా .... తుది ఫలితాల్లో 240 స్థానాలు కూటమికి లభించడం వెనుక దళిత ఓటు ప్రభావం ఎంతో ఉంది. ఒకటి, రెండు చోట్ల మినహాయిస్తే దళితులు ఏ కూటమివైపు మొగ్గు చూపితే వారు మెజారిటీ స్థానాలు పొందారు.
రేపు ఎన్నికలు జరగాల్సి ఉన్న మహారాష్ట్రలోనూ మొన్న 46 శాతం దళిత ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గితే, 35 శాతం ఓటర్లు మాత్రమే ఎన్డీయే కూటమిపక్షం వహించారు. ఫలితాలూ అదే రీతిలో వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే ట్రెండ్ విస్పష్టంగా కనిపించింది.
దళితుల కోసం ఏ ప్రభుత్వమైనా చేసేది ఏముంటుంది? అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. సాధారణ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఎలా ఉన్నా... కొద్దో గొప్పో దళితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం, వారి ప్రగతి పట్ల శ్రద్దాసక్తులు చూపడం, ముఖ్యంగా దళితుల భద్రతకు నిలబడి వారికో భరోసా కల్పించడం వంటివి చాలా ముఖ్యం. అది కల్పించలేనపుడు వారి విశ్వాసం కోల్పోవడం, తద్వారా ఎన్నికల్లో వారి మొగ్గును కూడా కోల్పోవడం సహజమని ఉత్తరప్రదేశ్, బీహార్లలో తలెత్తిన పరస్పర విరుద్ద పరిణామాలు, వెల్లడైన విరుద్ద ఫలితాలు ఇదే విషయాన్ని దృవపరుస్తున్నాయి.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో దళితులకు ఎంతవరకు రక్షణ లభిస్తోంది? దళితులపై దాడులు, హింస, మానభంగాలు వంటివి చోటు చేసుకుంటున్నాయి? నివారణకు సర్కార్లు ఎలా స్పందిస్తున్నాయి? ఇత్యాధి విషయాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారాంశాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు, పెద్దమొత్తంలో డబ్బు వెచ్చించి నిర్వహించే వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లో ఈ అంశం కూడా ప్రధాన ప్రచారాంశం అవుతోంది.అది కొంతమేర దళితులను, వారి ఆలోచనా సరళిని ప్రభావితం చేస్తోంది.
అయోధ్య ఓటమి అంచనా వేసిందా?
హిందువుల సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత భవ్య రామమందిరం నిర్మించిన సంవత్సరంలోనే అయోధ్యతో కూడి ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవదేశ్ ప్రసాద్ (దళిత్) డబుల్ ఇంజన్ పాలక బీజేపీకి చెందిన తల్లూ సింగ్ (ఠాకూర్)ను ఓడించారు. ఇదేం రిజర్వుడ్ సీటు కూడా కాదు! అరుదైన విజయం. దేశవ్యాప్తంగా కూడా ఇలా అరుదుగానే జరుగుతుంది.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి (2009) ఎన్నికల్లో తెలంగాణలోని మల్కాజిగిరి జనరల్ స్థానం నుంచి దళితుడైన సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్) విజయం సాధించారు. ఒక ఓపెన్ సీట్లో దళిత్ అభ్యర్థి, ఎన్డీయే కూటమికి చెందిన ఠాకూర్‌ను, అదీ ఉత్తర్ప్రదేశ్‌లో ఓడించడాన్ని ఎలా చూడాలి?
జాతీయ ఎన్నికల సర్వే (ఎన్ఈఎస్) ప్రకారం ఉత్తర్ప్రదేశ్‌లో ఎంతో కొంత కాంగ్రెస్/ఇండియా కూటమి వైపు మొగ్గిన దళితులు, అదే రకం రాజకీయ వాతావరణం ఉండే పక్క రాష్ట్రం బిహార్లో అటువంటి మొగ్గు చూపలేదు. అందుకే, ఫలితాలు కూడా అదే వరుసలో, అక్కడ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లో దళిత ఓట్లు ఇదివరకటి కన్నా ఎన్డీయేకు తగ్గి (26 శాతం) లభిస్తే, సంప్రదాయ బద్దంగా ఎక్కువ దళిత ఓట్లు పొందే బీఎస్పీ (32) కన్నా మించి ఇండియా కూటమికి (38 శాతం) దళిత ఓట్లు లభించాయి. కానీ, పక్కనున్న బిహార్లో ఇండియా కూటమికి 40 శాతం దళిత ఓట్లు దక్కితే ఎన్డీయే కూటమికి 60 శాతం లభించాయి. రాష్ట్రాలు, అక్కడున్న పరిస్థితులను బట్టి ఈ దామాషా మారుతూ వచ్చింది. సీట్లు కూడా ఇదే క్రమంలో వచ్చాయి.
దేశ వ్యాప్తంగా చూసినపుడు, మొత్తం మీద ఇండియా కూటమి లాభపడింది. హర్యానాలో 2014, 2019లోక్సభ ఎన్నికల్లో పదికి పది స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఈ సారి 5 సీట్లు మాత్రమే రాగా మిగిలిన 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సర్వేలో, సర్వేయర్లు పలుకరించిన ప్రతి ముగ్గురు దళితుల్లో ఇద్దరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 67 శాతం దళిత ఓటు ఇండియా కూటమికి లభిస్తే 25 శాతం మాత్రమే ఎన్డీయే పక్షం వహించినట్టు సర్వేలో వెల్లడయింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ మార్పు సంకేతం
ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి దళితులు ఆయా పార్టీలు/కూటముల వైపు మొగ్గు చూపారు. తెలంగాణలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకులుగా ఉన్న దళితులు గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారా? మరే కారణమో తెలియదు కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచీ దాదాపు అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ (ఇదివరకటి టీఆర్ఎస్) వైపే వారు మొగ్గుతూ వచ్చారు. వారి మనసు మరింత గెలవటానికో, ఉన్నది నిలబెట్టుకోవడానికో ‘దళితబంధు’ వంటి ఆకర్షనీయ పథకాన్ని కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టారు. అయినా, మెజారిటీ దళితులు ఈ సారి కాంగ్రెస్ వైపే మొగ్గారు.
విడిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, లోకసభ ఎన్నికల్లోనూ ఇదే ప్రస్పుటమైంది. మాదిగ, మాల ఉపకులాల మధ్య సమతూకం పాటించలేదనే విమర్శ ఉన్నా, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. 46 శాతం దళిత ఓటు కాంగ్రెస్/ఇండియా కూటమికి రాగా 31 శాతం ఓటు వాటా బీఆర్ఎస్‌కు దక్కింది. పోటీలో ఉన్న మరో ముఖ్యపార్టీ బీజేపీ 23 శాతం ఓటు వాటా పొందడంతో బీఆర్ఎస్ వాటా గతం కంటే బాగా తగ్గింది. ఫలితంగా వారికి కనీసం ఒక లోక్‌సభ స్థానం కూడా దక్కలేదు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దళిత ఓటు మొగ్గు మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. బలహీనంగా ఉన్న (కాంగ్రెస్) ఇండియా కూటమికి రెండు శాతం దళిత ఓటు వాటా మాత్రమే దక్కింది. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమికి 48 శాతం దళిత ఓటు వాటా దక్కి మూడింట రెండు లోక్‌సభ ఎస్సీ రిజర్వుడు స్థానాల (అమలాపురం, బాపట్ల)ను కూటమిలో మేజర్ భాగస్వామి అయిన తెలుగుదేశం గెలుచుకుంది.
ఆశ్చర్యకరంగా 50 శాతం ఎస్సీ ఓటు వాటాను నిలబెట్టుకున్న వైఎస్ఆర్సీపీకి ఒక లోక్‌సభ స్థానం (తిరుపతి) మాత్రమే దక్కింది. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా వారికి అరకొర (11/175) అసెంబ్లీ స్థానాలే లభించినా 40 శాతం ఓటు వాటా దక్కడానికి రాష్ట్రంలోని దళిత ఓట్లలో 50 శాతం వారి పక్షాన్నే ఉండట ప్రధాన కారణం. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభకు జరిగిన జమిలి ఎన్నికలకు తగినంత ముందుగానే ఒక సంకేతాన్ని ‘పీపుల్స్ పల్స్’ సర్వే విస్పష్టంగా చెప్పింది. ఏపీ లోని 29 అసెంబ్లీ స్థానాల్లో 19 చోట్ల టీడీపీకి అనుకూలత ఉందని, రాజకీయ గతానుభవాలను బట్టి ఎస్సీ స్థానాల్లో ఆధిక్యత ఉన్నవాళ్లే అధికారంలోకి వస్తారనే భావనను గుర్తు చేసింది. అంతిమంగా అదే జరిగింది. ఏ కోణంలో చూసినా దళిత ఓటు మొగ్గు ఓ బలమైన ప్రభావకంగా స్పష్టమౌతోంది.
- దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)