Crucial INDIA bloc meeting: ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతల నిర్ణయం-crucial india bloc meeting no boycott of exit poll debates ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Crucial India Bloc Meeting: ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతల నిర్ణయం

Crucial INDIA bloc meeting: ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతల నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Jun 01, 2024 06:13 PM IST

Crucial INDIA bloc meeting: న్యూస్ చానళ్లలో జరిగే ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఎగ్జిట్ పోల్స్ వంటి ఊహాగాన కార్యక్రమాల్లో తమ పార్టీ పాల్గొనదని శుక్రవారం కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్ణయం నుంచి వారు వెనక్కు తగ్గారు.

ఢిల్లీలో మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం
ఢిల్లీలో మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం

INDIA bloc: శనివారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడానికి కొన్ని గంటల ముందు ప్రతిపక్షఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఎగ్జిట్ పోల్ టెలివిజన్ డిబేట్లను ఇండియా కూటమి బహిష్కరించకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు.

వెనక్కు తగ్గిన కాంగ్రెస్

ఎగ్జిట్ పోల్ టెలివిజన్ డిబేట్లలో తాము పాల్గొనబోమని కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ వెనక్కు తీసుకుంది. ఇండియా కూటమి సమావేశంలో కేజ్రీవాల్, రాఘవ్ చద్దా, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా మల్లిఖార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, మెహబూబా ముఫ్తీ గైర్హాజరయ్యారు. ‘‘ఎగ్జిట్ పోల్స్ లో పాల్గొనడానికి అనుకూల, వ్యతిరేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ సాయంత్రం టెలివిజన్ చానల్లలో జరిగే ఎగ్జిట్ పోల్ డిబేట్లలో ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీలు పాల్గొనాలని ఏకాభిప్రాయంతో నిర్ణయించాం’’ అని సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రకటించారు.

మమతా, స్టాలిన్, భేటీకి గైర్హాజరయ్యారు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చివరి దశ ఎన్నికల రోజున సమావేశానికి హాజరు కావడం సాధ్యం కాదని ప్రకటించారు. ఎన్నికలతో పాటు తుఫాను సహాయక చర్యలే సమావేశం గైర్హాజరు కావడానికి కారణమని మమత పేర్కొన్నారు. ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఒంటరిగానే పోటీ చేసింది. తాను ఢిల్లీకి వెళ్లబోనని, అయితే డీఎంకే తరఫున టిఆర్ బాలు ఈ సమావేశంలో పాల్గొంటారని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చెప్పారు. పదేళ్ల బీజేపీ ఫాసిస్టు పాలనను ఓడించి భారత్ ను కాపాడేందుకు ఏర్పడిన తమ ఇండియా కూటమి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి విజయతీరాలకు చేరుకుందన్నారు. తన తల్లికి కంటి శస్త్రచికిత్స జరిగినందున సమావేశానికి గైర్హాజరు కావచ్చని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు.

Whats_app_banner