Warangal Loksabha: ఓరుగల్లుపై మూడు పార్టీల గురి.. అగ్రనేతల రాకతో రాజుకున్న వేడి, పోటాపోటీగా ప్రచారం-all three parties are trying hard to win the warangal lok sabha seat ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal Loksabha: ఓరుగల్లుపై మూడు పార్టీల గురి.. అగ్రనేతల రాకతో రాజుకున్న వేడి, పోటాపోటీగా ప్రచారం

Warangal Loksabha: ఓరుగల్లుపై మూడు పార్టీల గురి.. అగ్రనేతల రాకతో రాజుకున్న వేడి, పోటాపోటీగా ప్రచారం

Sarath chandra.B HT Telugu
Apr 23, 2024 06:44 AM IST

Warangal Loksabha: వరంగల్ ఎంపీ సీటుపై మూడు ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తుండగా.. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ఆయా పార్టీల అగ్రనేతలు కూడా ఓరుగల్లు బాట పడుతున్నారు.

వరంగల్ లోక్‌సభ పరిధిలో దూకుడు పెంచిన పార్టీలు
వరంగల్ లోక్‌సభ పరిధిలో దూకుడు పెంచిన పార్టీలు

Warangal Loksabha: వరంగల్‌లో ఇప్పటికే కాంగ్రెస్ Congress, బీఆర్ఎస్ BRS అగ్రనేతల టూర్ షెడ్యూల్ ఖరారు కాగా.. తొందర్లోనే బీజేపీ BJP పెద్దలు కూడా ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టనున్నారు. ప్రధాన పార్టీల పెద్ద లీడర్ల రోడ్ షోలు, ప్రచార సభలతో వరంగల్ లో సందడి నెలకొనగా.. అగ్రనేతల రాకతో వరంగల్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.

కడియంను ఓడగొట్టేందుకు కేసీఆర్, కేటీఆర్

కడియం శ్రీహరి Kadiyam Srihariపార్టీ మారిన తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒకరకంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఎంపీ టికెట్ కేటాయించిన తరువాత కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య పార్టీని వీడి అవమాన పరిచారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కడియం ఫ్యామిలీపై రగిలిపోతోంది.

ఎలాగైనా కడియంను ఓడగొట్టాలని కసితో పని చేస్తోంది. కాగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ బరిలో నిలవగా.. ఆయనను గెలిపించుకోవడం కంటే కడియంను ఓడగొట్టడంపైనే గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీ జిల్లా నాయకత్వం నుంచి పైవరకూ కడియంపై ప్రతీకారేచ్ఛతోనే ఉండగా.. కడియంను కావ్యను ఓడగొట్టడంపై కేసీఆర్, కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఇందులో భాగంగానే మంగళవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ నగరానికి రానున్నారు. వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో చర్చించి, పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనుండగా.. కేటీఆర్ వచ్చివెళ్లిన వారం రోజుల్లో కేసీఆర్ వరంగల్ కు రానున్నారు. ఈ నెల 28న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ లో రోడ్డు షో నిర్వహించనున్నారు. వారం రోజుల్లోనే ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతల టూర్ ఉండటంతో ఆ పార్టీ నేతల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది.

పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్

వరంగల్ లోక్ సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండగా.. ఎంపీ సీట్ గెలిచి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఈ మేరకు నేతలందరినీ కలుపుకొని రెగ్యులర్ గా మీటింగులు కూడా నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే పార్టీ వరంగల్ ఇన్ఛార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో తరచూ మీటింగులు నిర్వహిస్తుండగా.. అదే వేడిని కొనసాగించేందుకు ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ తీసుకొచ్చి ప్రచార సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

మడికొండలో ఏర్పాటు చేయనున్న ప్రచార సభ కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించగా.. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రోగ్రామ్ చేపడుతున్నారు. ఇప్పటికే సంపూర్ణ బలం ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి రాకతో మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు.

అరూరి కోసం ఆరాటం..

బీజేపీ అభ్యర్థిగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పోటీ చేస్తుండగా.. వరంగల్ లో ఆ పార్టీకి కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. వరంగల్ స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులు, నగర అభివృద్ధి, అమృత్, హృదయ్ లాంటి పథకాలతో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందనే భావనతో ఆ పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు.

దానికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాను తీసుకొచ్చి మరింత మైలేజ్ పెంచుకోవాలని పార్టీ నేతలు భావించారు. కానీ 25న హైదరాబాద్ రానున్న అమిత్ షా బాన్సువాడ బహిరంగ సభకు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిసింది. ఇక 27న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తుండగా.. ఆయననూ వరంగల్ రప్పించేందుకు ఇక్కడి నేతలు ప్రయత్నాలు చేశారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన పర్యటన ఖరారు కాలేదు.

దీంతోనే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింఘ్ ధామి టూర్ ను ఫైనల్ చేశారు. 25న అరూరి రమేశ్ నామినేషన్ వేయనుండగా.. పుష్కర్ సింఘ్ ధామి రోడ్డు షో నిర్వహించి, ప్రసంగించనున్నారు. ఇదిలాఉంటే మే మొదటి వారంలోనైనా మోదీ లేదా అమిత్ షాను వరంగల్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

హోరాహోరీ పోరు

మూడు పార్టీల ముఖ్య నేతలు వరుస పెట్టి వరంగల్ నగరానికి వస్తుండటంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కతున్నాయి. ఇప్పటికే జనాల్లోకి ఉరుకులు, పరుగులు పెడుతున్న అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, కార్యకర్తల్లోనూ కొంత జోష్ కనిపిస్తోంది. మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కాగా లోక్ సభ ఎన్నికలకు ఇంకో 20 రోజుల సమయం ఉండగా.. అగ్రనేతల పర్యటనలు ఏమేర ప్రభావం చూపుతాయో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం