Lok Sabha Elections : బీజేపీని బీజేడీ అడ్డుకోగలదా? ఒడిశాలో కాంగ్రెస్​కు ‘టాటా- బైబై’ తప్పదా!-2024 lok sabha elections can bjp defeat mighty naveen patnaiks bjd ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  2024 Lok Sabha Elections Can Bjp Defeat Mighty Naveen Patnaik's Bjd?

Lok Sabha Elections : బీజేపీని బీజేడీ అడ్డుకోగలదా? ఒడిశాలో కాంగ్రెస్​కు ‘టాటా- బైబై’ తప్పదా!

Sharath Chitturi HT Telugu
Mar 10, 2024 03:25 PM IST

Odisha Lok Sabha elections 2024 : ఒడిశాలో బీజేడీ- బీజేపీ పొత్తుకు తెరపడింది. మరి ఈసారి జరగనున్న ఎన్నికల్లో బీజేపీని.. బీజేడీ అడ్డుకోగలుగుతుందా? కాంగ్రెస్​ పరిస్థేంటి?

2024 లోక్​సభ ఎన్నికలు.. ఒడిశాలో రసవత్తరంగా రాజకీయాలు..
2024 లోక్​సభ ఎన్నికలు.. ఒడిశాలో రసవత్తరంగా రాజకీయాలు..

2024 Lok Sabha Elections Odisha : 2024 లోక్​సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తులు- ఎత్తులు- పైఎత్తులతో పార్టీలన్నీ బిజీబిజీగా గడుపుతున్నాయి. వీటన్నింటి మధ్య.. ఒడిశా రాజకీయాలు గత కొన్ని రోజులుగా రసవత్తరంగా మారాయి. బీజేడీ- బీజేపీ మధ్య పొత్తు కుదిరినట్టే కుదిరి.. చివరి నిమిషంలో ఆగిపోయింది! ఈ పరిణామాలు లోక్​సభతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపిస్తాయి? రాష్ట్రంపై వేగంగా పట్టు సాధిస్తున్న బీజేపీని.. రాజకీయాల్లో అత్యంత సీనియర్​ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ అడ్డుకోగలరా?

ట్రెండింగ్ వార్తలు

2019 లోక్​సభ ఎన్నికల ఫలితాలు..

లోక్​సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో ఒడిశా రాష్ట్రంలో 21 సీట్లు ఉన్నాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో.. నవీన్​ పట్నాయక్​కి చెందిన బీజేడీ (బిజు జనతాదళ్​).. 12 సీట్లల్లో గెలిచింది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏకి ఒక్క సీటు దక్కింది.

వాస్తవానికి.. ఒడిశాలో అనాదిగా.. నవీన్​ పట్నాయక్​ పాలన సాగుతోంది. 2 దశాబ్దాల పాటు రాష్ట్రంపై ఆయన పట్టు కొనసాగుతూ వస్తోంది. కానీ 2019లో బీజేడీకి షాక్​ తగిలిందనే చెప్పుకోవాలి! 'మోదీ మేనియా'.. ఒడిశాపై ఊహించని విధంగా పనిచేసిందనే చెప్పొచ్చు. 2014లో బీజేపీ కేవలం ఒక్కటే సీటులో గెలిచింది. కానీ.. 2019 వచ్చేసరికి 8చోట్ల కాషాయ జెండాను ఎగరవేసింది. ఇది బీజేడీకి తలనొప్పిగా మారిన విషయం.

ఇంకా చెప్పాలంటే.. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో ఓటు షేరు విషయంలోనూ బీజేడీకి గట్టిపోటీనిచ్చింది కమలదళం. నవీన్​ పట్నాయక్​ పార్టీకి 42.8శాతం ఓట్లు దక్కాయి. 38.4శాతంతో ఆ తర్వాతి స్థానంలో బీజేపీ ఉంది.

ఇక ఒడిశాపై కాంగ్రెస్​ పట్టు అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది. 2014లో యూపీఏ ఖాతా తెరవలేదు. 2019లో కాంగ్రెస్​ పార్టీకి ఒక్కటంటే ఒక్కటే సీటు దక్కింది.

బీజేడీ వర్సెస్​ బీజేపీ..

2024 Odisha assemebly elections : బీజేడీ, బీజేపీలు వాస్తవానికి చాలా కాలం పాటు కలిసే ఉన్నాయి. 1998 నుంచి 2009 వరకు.. అటు రాష్ట్ర ఎన్నికలు ఇటు లోక్​సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. 1990 దశకంలో.. అప్పటి అటల్​ బిహారీ వాజ్​పేయీ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు నవీన్​ పట్నాయక్​. కానీ 2009 వచ్చేసరికి రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. చివరికి.. కూటమికి బీజేడీ గుడ్​బై చెప్పేసింది.

కానీ 2024 లోక్​సభ ఎన్నికలు, 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది! తొలుత.. ఈ రెండు పార్టీలు మళ్లీ కలుస్తున్నాయని వార్తలు వచ్చాయి. బీజేపీ నేతలు కూడా మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ సీటు సద్దుబాటు దగ్గర రెండు పార్టీలకు విభేదాలు ఎదురయ్యాయని సమాచారం! చివరికి.. రాష్ట్రం ఎన్నికలతో పాటు లోక్​సభ ఎన్నికలకు.. బీజేడీతో కలవడం లేదని, ఒంటరిగా పోటీ చేస్తున్నామని బీజేపీ ప్రకటించింది.

రూమర్స్​ ప్రకారం.. 21 లోక్​సభ సీట్లల్లో 14 చోట్ల పోటీ చేయాలని బీజేపీకి భావించింది. ఇది బీజేడీకి నచ్చలేదు. ఇక 147 సీట్లు ఉండే ఒడిశా అసెంబ్లీలో 100కుపైగా సీట్లల్లో పోటీ చేయాలని నవీన్​ పట్నాయక్​ బీజేడీ అనుకుంది. ఇది.. బీజేపీకి నచ్చలేదు! చివరికి.. బీజేడీ- బీజేపీ కలయిక సాధ్యపడలేదు!

"10 కన్నా తక్కువ లోక్​సభ సీట్లల్లో పోటిచేస్తే.. అది సూసైడే అవుతుంది," అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు.. లోక్​సభతో పాటు రాష్ట్ర ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన చేస్తామని బీజేపీ చాలా నమ్మకంతో ఉంది. తమ పార్టీకి చెందిన 80 ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని కమలదళం ప్రచారాలు చేస్తోంది. అందుకే.. బీజేడీ ఇచ్చిన సీట్లను తిరస్కరించినట్టు తెలుస్తోంది.

అయితే.. ఒడిశా 'రాజకీయా'ల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ- బీజేడీలు కూటమిగా లేకపోయినా.. కేంద్రంలో మోదీకి నవీన్​ పట్నాయక్​ అనేకమార్లు మద్దతుగా నిలిచారు. నవీన్​ పట్నాయక్​- మోదీలు ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది.. వారిద్దరి మధ్య బలమైన బంధాన్ని స్పష్టం చేస్తోంది.

నవీన్​ పట్నాయక్​ మనసులో ఏముంది?

BJP BJD alliance Odisha : ఓ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు సీఎంగా పనిచేసిన వారి జాబితాలో రెండోస్థానంలో ఉన్నారు నవీన్​ పట్నాయక్​. త్వరలో జరగనున్న 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారాన్ని చేపడితే.. నెం.1 స్థానానికి చేరుకుంటారు. కానీ రాష్ట్రంలో బీజేపీ శక్తివంతంగా ఎదుగుతుండటం.. ఆయనకు కచ్చితంగా తలనొప్పిని తెచ్చిపెట్టే విషయమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరీ ముఖ్యంగా.. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ బలంగా పుంజుకున్న తీరు.. బీజేడీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా.. భువనేశ్వర్​లో కాషాయ జెండా తొలిసారిగా ఎగరడటం.. నవీన్​ పట్నాయక్​కి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఆయన కూడా.. దానిని వ్యక్తిగత నష్టంగానే తీసుకున్నారట. ఈసారి చర్చలు విఫలమవడంలో ఈ భువనేశ్వర్​ లోక్​సభ సీటు కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. భూవనేశ్వర్​ సీటు తమకు కావాలని బీజేడీ తేల్చిచెబితే.. అస్సలు ఇవ్వమని బీజేపీ స్పష్టం చేసేసిందట. మరి బీజేపీపై గెలిచేందుకు నవీన్​ పట్నాయక్​.. ఈ సారి ఎలాంటి అస్త్రాలను రూపొందిస్తారో చూడాలి.

కాంగ్రెస్​ పరిస్థితేంటి..?

ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్​సభ ఎన్నికలైనా ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు బీజేడీ, బీజేపీ. రాష్ట్రంలో.. కాంగ్రెస్​ ఉనికిని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో.. పార్టీకి చాలా తక్కువ ఓటు పర్సెంటేజ్​ నమోదైంది. 147 సీట్లు ఒడిశా అసెంబ్లీలో కూడా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచింది తొమ్మిది మాత్రమే!

బీజేపీ- బీజేడీలు కలిసినా, విడిపోయినా.. తమకే మేలు జరుగుతుందని కాంగ్రెస్​ నేతలు అభిప్రాయపడుతున్నారు. రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్​ ఎదుగుతొందని అంటున్నారు. కానీ.. ఆ రెండు పార్టీలపై ప్రజల్లో నిజంగా వ్యతిరేకత ఉన్నా.. వాటిని ఓట్ల రూపంలో మార్చుకోవడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో మొదటి రెండు పార్టీలు, కాంగ్రెస్​ ఓట్ల శాతం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

ఏది ఏమైనా.. ఈసారి ఒడిశాలో రాజకీయాలు వాడీవేడీగా ఉండనున్నాయి! ఇందులో విజయం ఎవరు సాధిస్తారు? బీజేడీ పుంజుకుంటుందా? లేక బీజేపీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందా? ప్రజలు కాంగ్రెస్​వైపు చూస్తారా? అనేది వేచి చూడాలి!

WhatsApp channel

సంబంధిత కథనం