Elections 2023 : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ..
Elections 2023 news : మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరాటం నడుస్తోంది!
Elections 2023 news : మరో హైఓల్టేజ్ ఘట్టానికి దేశం సన్నద్ధమైంది. మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో.. బీజేపీ- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న రాజకీయ విశ్లేషకుల అంచనాల మధ్య.. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు..
మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా.. బైహర్, లంజి, పర్స్వారా అసెంబ్లీ సీట్లతో పాటు మాండ్లా, దిండోరి జిల్లాల్లోని బూత్‌లలో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
Madhya Pradesh elections 2023 live updates : పోలింగ్ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల సంఘం. మాక్ డ్రిల్స్‌ని సైతం నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు.. రాష్ట్రంలో భద్రతను కూడా పెంచారు అధికారులు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
ఈ దఫా ఎన్నికల్లో.. 230 సీట్ల కోసం 2,533 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 5.60కోట్లకుపైగా మంది ఓటర్లు.. వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు 2023..
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. 20సీట్లకు.. ఈ నెల 7న పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కాగా.. మిగిలిన 70 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత బిద్రానవాగడ్, రాజిమ్ జిల్లాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
Chhattisgarh elections 2023 live updates : నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న 20 సీట్లల్లో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండో దశ పోలింగ్‌కి కూడా అదే స్థాయిలో చర్యలు చేపట్టారు. భద్రతాదళాలను భారీ సంఖ్యలో మోహరించారు.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌ను కాంగ్రెస్ పాలిస్తోంది. సొంత రాష్ట్రాల్లో తిరిగి అధికారం చేపట్టి, మరో రాష్ట్రాన్ని కూడా ఛేజిక్కించుకోవాలని ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాహుబలి అభ్యర్థులతో పాటు కచ్చితంగా గెలుస్తారనుకున్న వారికే టికెట్లు ఇచ్చాయి.
Madhya Pradesh elections 2023 : మధ్యప్రదేశ్‌లో.. గడిచిన 20ఏళ్లల్లో, 18ఏళ్లలు బీజేపీ అధికారంలో ఉంది 2018 ఎన్నికల తర్వాత.. 18 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం కుప్పకూలింది. ఈసారి ఎలాగైనా మెజారిటీతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది.
ఇక ఛత్తీస్‌గఢ్‌లో 2003 నుంచి 2018 వరకు బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి, బీజేపీకి షాక్ ఇచ్చింది. మరి ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు? అన్న ప్రశ్నలపై ఉత్కంఠ నెలకొంది.
మిజోరంలో ఎన్నికలు ముగిశాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సమరం నేటితో ముగియనుంది. రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ముగిసిన తర్వాత.. 5 రాష్ట్రాల ఫలితాలు.. డిసెంబర్ 3న వెలువడనున్నాయి.
సంబంధిత కథనం