Vijayashanti Resigns : బీజేపీకి విజయశాంతి రాజీనామా, ఎల్లుండి కాంగ్రెస్ గూటికి!-hyderabad news in telugu vijayashanti resigned to bjp joins congress ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Vijayashanti Resigns : బీజేపీకి విజయశాంతి రాజీనామా, ఎల్లుండి కాంగ్రెస్ గూటికి!

Vijayashanti Resigns : బీజేపీకి విజయశాంతి రాజీనామా, ఎల్లుండి కాంగ్రెస్ గూటికి!

Bandaru Satyaprasad HT Telugu
Nov 15, 2023 10:16 PM IST

Vijayashanti Resigns : బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. ఎల్లుండి ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం.

విజయశాంతి
విజయశాంతి

Vijayashanti Resigns : సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె... బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి... విజయశాంతి కాంగ్రెస్ లో చేరతారని ఇటీవల తెలిపారు. తాజాగా ఆమె బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై గత కొంత కాలంగా విజయశాంతి అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతల మీటింగ్ లకు సైతం ఆమె దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్ లోకి

మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారు. విజయశాంతి కాంగ్రెస్ లోకి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఇటీవల ప్రకటించారు. గత కొంత కాలంగా విజయశాంతి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా కార్యక్రమాలకు కూడా ఆమె హాజరకావడంలేదు. దీంతో బీజేపీ అధిష్టానంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పార్టీ మారతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుండగా... ఇటీవల మల్లు రవి ప్రకటన తాజాగా బీజేపీకి విజయశాంతి రాజీనామాతో ఇది ఖరారైంది.

విజయశాంతి రాజకీయ ప్రస్థానం

సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట్లో బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. మొదట్లో పరోక్ష రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై పోటీ చేయాలనుకున్నారు విజయశాంతి. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో... విజయశాంతి పోటీ నుంచి తప్పుకున్నారు.

2009 వరకు బీజేపీలో ఉన్న విజయశాంతి... ఆ తర్వాత తల్లీ తెలంగాణ పేరుతో సొంత పార్టీని పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2009లో మెదక్‌ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కేసీఆర్‌తో విభేదాల రావడంతో 2014లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో స్టార్‌ క్యాంపెయినర్‌, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా పనిచేశారు. అయితే 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

Whats_app_banner