Madhya Pradesh elections : హోరాహోరీగా మధ్యప్రదేశ్‌ ఎన్నికలు .. కానీ కాంగ్రెస్‌దే పైచేయి!-madhya pradesh elections 2023 peoples pulse survey says tough fight with congress upper hand ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Madhya Pradesh Elections : హోరాహోరీగా మధ్యప్రదేశ్‌ ఎన్నికలు .. కానీ కాంగ్రెస్‌దే పైచేయి!

Madhya Pradesh elections : హోరాహోరీగా మధ్యప్రదేశ్‌ ఎన్నికలు .. కానీ కాంగ్రెస్‌దే పైచేయి!

HT Telugu Desk HT Telugu
Nov 11, 2023 01:45 PM IST

Madhya Pradesh elections 2023 : త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్‌ ఎన్నికలపై పీపుల్స్‌ పల్స్‌-డాటాలోక్‌ డాట్‌ ఇన్‌ బృందం సర్వే చేపట్టింది. ఈ రాష్ట్రంలో హోరాహోరీ పోరుకు అవకాశం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్​ పైచేయి సాధిస్తుందని అంచనా వేసింది.

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో హోరాహోరీ .. కానీ!
మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో హోరాహోరీ .. కానీ! (Peoples Pulse)

Madhya Pradesh elections 2023 : లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్కటైన మధ్యప్రదేశ్‌లో.. నవంబర్‌ 17న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో అధిక స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల నాడీని అంచనా వేయడంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌ ఎన్నికలపై పీపుల్స్‌ పల్స్‌-డాటాలోక్‌ డాట్‌ ఇన్‌ బృందం చేపట్టిన సర్వేలో పోటాపోటీగా జరగనున్న రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్వల్ప ఓట్ల శాతం తేడాతో అధికారం చేపట్టే అవకాశాలున్నాయని తేలింది.

హోరాహోరీ పోరు తప్పదు..!

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలుండగా, 116 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించడానికి బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికలను అధ్యయనం చేయడంలో భాగంగా ఆశిష్‌ రంజన్‌ నేతృత్వంలో పీపుల్స్‌ పల్స్‌ - డాటాలోక్‌ డాట్‌ ఇన్‌ సంస్థలు సంయుక్తంగా 2018 ఎన్నికల డేటాను పరిణగలోకి తీసుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి మధ్యప్రదేశ్‌ మూడు రిపోర్టు-2023 విడుదల చేశారు. ఈ బృందం రాష్ట్ర వ్యాప్తంగా 2023 అక్టోబర్‌ 5 నుండి నవంబర్‌ 5వ తేదీ వరకు 2500 కిమీలకు పైగా పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది.

Madhya Pradesh elections 2023 predictions : పీపుల్స్‌ పల్స్‌ - డాటాలోక్‌ డాట్‌ ఇన్‌ బృందం రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్‌ నువ్వానేనా అన్నట్టు తలపడుతుండడంతో 1`2 శాతం ఓట్ల వ్యత్యాసం రాష్ట్రంలో అధికారాన్ని నిర్ధేశించనుంది. బీజేపీ మెజార్టీ సాధించాలంటే 2 శాతం ఓట్లు అధికం అవసరం. అదే కాంగ్రెస్‌ ఒక్క శాతం అధికం ఓట్లు సాధిస్తే పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని అధ్యయనంలో తేలింది. కాంగ్రెస్‌ తమ ఓట్ల శాతాన్ని 41 నుండి 42 మధ్య సాధిస్తే బీజేపీ 40 శాతానికి పరిమితం అవడంతోపాటు కాంగ్రెస్‌ సుమారు 130 స్థానాలు పొంది అధికారం చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్షేత్రస్థాయిలో పరిశీలనబట్టి అవగాహన అవుతోంది.

రాష్ట్రంలో గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే బుందేల్‌ఖండ్‌, మధ్యభారత్‌, మాల్వా నార్త్‌, వింధ్యా ప్రాంతాల్లో బీజేపీ, గ్వాలియర్‌-చంబల్‌, మహాకౌశల్‌, మాల్వా ట్రైబల్‌ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అర్బన్‌ ప్రాంతాల్లో మొదటి నుండి బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుండగా 2018లో కాంగ్రెస్‌ ఇక్కడ పుంజుకొని 7 శాతం ఆధిక్యత సాధించింది. అంతర్లీనంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీ నష్టపోయే అవకాశాలున్నాయి. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక రంగాలలో విఫలం కావడంతో పాటు నిరుద్యోగం, అభివృద్ధి చేయడంలో విఫలం అవడం వంటి అంశాలు గణనీయంగా ప్రభావితం చూపనున్నాయి.

Madhya Pradesh elections 2023 date : పీపుల్స్‌పల్స్‌-డాటాలోక్‌ డాన్‌ ఇన్‌ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తే అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో రెండు పార్టీలకు సమానస్థాయిలో పట్టు ఉంది. చౌహాన్‌ ప్రభుత్వం ‘లాడీ బెహన్‌’ పథకంపై ప్రధానంగా గ్రామీణంలోని మహిళా ఓట్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. సాత్నాజిల్లాలోని నాగోద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ బృందం పర్యటించినప్పుడు గ్రామంలోని మహిళలు ‘లాడీ బెహన్‌’ పథకంతో ప్రయోజనం పొందినా, వెనుకబడిన గ్రామాలలో అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం సమస్యలతో బీజేపీకి అనుకూలంగా లేరు.

రాష్ట్ర జనాభాలో కీలకమైన ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) వారు 45 శాతంతో ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారు. 2003 వరకు అగ్రవర్ణాల ముఖ్యమంత్రుల నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలో

ఉండగా, అనంతరం బీజేపీ వివిధ ఓబీసీ నేతల నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. బీజేపీ 1990 నుండి ఓబీసీ వర్గాల నుండి స్థిరమైన మద్ధతు పొందుతోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత ఉండడంతో మొదటి నుండి చేదోడుగా ఉన్న ఈ వర్గాల మద్దతు ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి పూర్తి స్థాయిలో లభించడం ప్రశ్నార్థకమే.

ఆదివాసీలు, ఎస్టీలు రాష్ట్ర జనాభాలో 21 శాతం ఉన్నారు. వీరు మహాకౌశల్‌, మాల్వా ట్రైబల్‌ నిమార్‌ ప్రాంతాల్లో అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 47 ఎస్టీ స్థానాల్లో 32 ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ వన్వాసి కల్యాణ్‌ ఆశ్రమ్‌ సహాయ సహకారాలతో గత కొంత కాలంగా బీజేపీ ఇక్కడ పటిష్టంగా మారింది. అయితే గతంలో వచ్చిన నర్మదా నది వరదల సమయంలో బీజేపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని, వరద బాధితులకు సహాయ సహకారాలు అందజేయడంలో కూడా విఫలమైందనే అసంతృప్తి వీరిలో ఉండడం రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నష్టం కలిగించవచ్చు.

Madhya Pradesh elections latest news : రాష్ట్రంలో ముస్లిం ఓటర్ల ప్రభావం సుమారు 45కు పైగా స్థానాల్లో ఉంది. ఈ స్థానాల్లో మొదటి నుండి కాంగ్రెస్‌ ఆధిపత్యమే సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ ఈ ప్రాంతాల్లో అధిక స్థానాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్రంలో రెండు పార్టీలు అన్ని అస్త్రాలతో పోటాపోటీగా ఉండంతో వీటి మధ్య అతి తక్కువ ఓట్ల వ్యత్యాసంతో అధికారం చేపట్టే అవకాశాలు ఎవరికి ఉన్నాయో డిసెంబర్‌ 3వ తేదీన వెలువడే ఫలితాలే తేలుస్తాయి. పీపుల్స్‌పల్స్‌ - డాటాలోక్‌ డాట్‌ ఇన్‌ నవంబర్‌ 30వ తేదీన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోస్ట్‌ పోల్‌ సర్వే ఫలితాలను కూడా ప్రకటిస్తుంది.

-– పీపుల్స్‌ పల్స్‌, డాటాలోక్‌ డాట్‌ ఇన్‌.

Whats_app_banner

సంబంధిత కథనం