Telangana Elections 2023 : అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Dubbak Assembly Constituency News: కత్తిపోటుకు గురై చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాతర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు.
Telangana Assembly Elections 2023: అంబులెన్సులో వచ్చి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇటీవల కాలంలో ప్రభాకర్ రెడ్డి కత్తిపోటుకు గురై గత 10 రోజులుగా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.కావున గురువారం వైద్యుల పర్యవేక్షణ లో ఆసుపత్రి నుండి ప్రత్యేక అంబులెన్సు లో వచ్చిన ప్రభాకర్ రెడ్డి, మంత్రి హరీష్ రావు తో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు.ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ. మంచి మనిషికి, కోతల మనిషికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు. దుబ్బాక లో 50 వేల మెజారిటీతో ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం అయ్యిందని… ఈ ర్యాలీ లో పాల్గొన్న జనాన్ని చూస్తే ప్రతిపక్షాల గుండెలు పేలిపోతాయని మంత్రి అన్నారు. ప్రభాకర్ రెడ్డి మంచి వ్యక్తి,ఆయనపై కొంత మంది రెచ్చ గొట్టి దాడి చేయించారు. అమానుషంగా,దుర్మార్గంగా కత్తితో దాడి చేశాడని అన్నారు. నాలుగు గంటలు ఆపరేషన్ చేసి డాక్టర్ లు ప్రాణం కాపాడారని చెప్పారు.అలాంటి వారికి దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.ఈ ఎన్నికలు మంచి మనిషికి, కోతల మనిషికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ప్రజలే వారికీ ప్రభాకర్ రెడ్డి గెలిపించి బుద్ధి చెప్పాలన్నారు.
26న దుబ్బాక కు కేసీఆర్...
గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నూరు అబద్ధాలు ఆడి ఎన్నికల్లో గెలిచాడని,అతడు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని విమర్శించారు మంత్రి హరీశ్. ఇప్పుడు అలాగే ఇమానాలు, ప్రమాణాలని చెప్తే నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి హెచ్చరించారు. కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ కొట్టేది ముమ్మాటికీ నిజమని,వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని,కేసీఆర్ ప్రతిపాదించిన ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆర్ధిక మంత్రి హరీష్ రావు కోరారు. 26 న కేసీఆర్ దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారని, ఊళ్లకు ఊళ్లు తాళాలు వేసి తరలి రావాలన్నారు. మెదక్ జిల్లా గులాబీ ఖిల్లా.మెదక్ జిల్లాలో 10 స్థానాల్లో గెలుపు ఖాయమని అన్నారు.
కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు....
మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని జగిత్యాల జిల్లా కొండగట్టు రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీశ్ రావు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. నేడు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్న మంత్రి హరీశ్ రావు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం ఉదయాన్నే కొండగట్టుకు చేరుకున్నారు.