EC On Tenali Incident : తెనాలిలో ఓటర్ పై దాడి ఘటన, వైసీపీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు-amaravati ec serious on tenali ysrcp candidate attacked voter orders house arrest ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec On Tenali Incident : తెనాలిలో ఓటర్ పై దాడి ఘటన, వైసీపీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు

EC On Tenali Incident : తెనాలిలో ఓటర్ పై దాడి ఘటన, వైసీపీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
May 13, 2024 03:53 PM IST

EC On Tenali Incident : తెనాలిలో ఓటర్ పై దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ను హౌస్ అరెస్టు చేయాలని ఆదేశించింది.

 వైసీపీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్
వైసీపీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్

EC On Tenali Incident : తెనాలి ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ పోలీసులను ఆదేశించింది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఆయనను హౌస్ అరెస్టులో ఉంచాలని పేర్కొంది. పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ పై చేయి చేసుకున్న ఘటనపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది. తెనాలిలో ఓ పోలింగ్ కేంద్రంలో ఓటర్ పై వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ దాడి చేశారు. శివకుమార్‌ అనుచరులు సైతం దాడి చేయడంతో ఓటర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈసీ చర్యలు చేపట్టింది.

అసలేం జరిగిందంటే?

తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ఓటరు చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. పోలింగ్ కేంద్రంలోకి తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్‌ను ఓటర్లు అడ్డుకున్నారు. ఓ యువకుడు ఎమ్మెల్యే తీరును ప్రశ్నించడంతో ఆగ్రహించిన శివకుమార్‌ ఓటరును చెంప దెబ్బ కొట్టారు. దీంతో సదరు వ్యక్తి కూడా ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మరోవైపు ఎమ్మెల్యే ఓటరుపై దాడి చేసిన ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయంలోని కంట్రోల్‌ రూమ్‌లో ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు మిశ్రా గుర్తించారు. ఎమ్మెల్యే అభ్యర్థి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసీ సీరియస్

ఈ ఘటనపై సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పందిస్తూ.. సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ తమ వద్ద ఉందన్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేతో పాటు ఇతరులపై కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీను ఆదేశించినట్లు తెలిపారు.

అన్నాబత్తుని శివప్రసాద్ ఏమన్నారంటే?

ఈ ఘటనపై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ స్పందించారు. తెనాలి ఐతాన‌గ‌ర్‌లో తన భార్యతో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి వెళ్లామన్నారు. ఈ సమయంలో గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి...తనను దుర్భాషలాడడన్నారు. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాక‌ర్ తనపై దుర్భాష‌లాడాడని అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌ ఆరోపించారు. వైసీపీపై చాలా ద్వేషంతో అతడు ర‌గిలిపోయాడన్నారు. చాలా శాడిజంగా మాట్లాడాడన్నారు.

"నా భార్య ముందే న‌న్ను అస‌భ్యంగా దూషించాడు. బూత్‌లోకి వెళ్లేట‌ప్పుడు..వ‌చ్చేట‌ప్పుడూ దుర్భాష‌లాడుతూనే ఉన్నాడు. గొట్టిముక్కల సుధాక‌ర్ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ వ్యక్తి. నువ్వు అస‌లు క‌మ్మోడివేనా అంటూ అస‌భ్యంగా మాట్లాడాడు. పోలింగ్ బూత్ వ‌ద్ద మ‌ద్యం మ‌త్తులో అంద‌రి ముందు చాలా దురుసుగా ప్రవ‌ర్తించాడు. పోలింగ్ బూత్‌లో ఉద‌యం నుంచి అత‌డు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నట్లు అక్కడి ఓట‌ర్లే చెప్పారు. అత‌డు బెంగులూరులో ఉంటూ ఇక్కడ‌కు వ‌చ్చి హ‌డావుడి చేశాడు. టీడీపీ, జ‌న‌సేన వాళ్లు ఎక్కడెక్కడి నుంచో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి వైసీపీ ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నారు"- అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌

Whats_app_banner

సంబంధిత కథనం