Tilak Varma: సఫారీ గడ్డపై శతక్కొట్టిన హైదరాబాద్ క్రికెటర్.. మూడో టీ20లో దక్షిణాఫ్రికా టార్గెట్ 220
IND vs SA 3rd T20: దక్షిణాఫ్రికా గడ్డపై మొన్న సంజు శాంసన్ సెంచరీ బాదగా.. బుధవారం రాత్రి తిలక్ వర్మ శతకం బాదేశాడు. దాంతో సిరీస్‌లో భారత్ జట్టు మరోసారి 200పైచిలుకు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికాకి నిర్దేశించగలిగింది.
దక్షిణాఫ్రికా గడ్డపై టీ20ల్లో మరో భారత క్రికెటర్ సెంచరీతో కదం తొక్కాడు. గత శుక్రవారం డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో సంజు శాంసన్ సెంచరీ సాధించగా.. సెంచూరియన్ వేదికగా బుధవారం రాత్రి జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌కి చెందిన తిలక్ వర్మ 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయంగా 107 పరుగులు చేశాడు. దాంతో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
సంజు డకౌట్.. ఆ వెంటనే తిలక్ విధ్వంసం
మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆడెన్ మార్‌క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.దాంతో అభిషేక్ శర్మతో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంజు శాంసన్ (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఫస్ట్ ఓవర్‌లోనే మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అయితే.. నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన తిలక్ వర్మ మొదటి నుంచే టాప్ గేర్‌లో ఆడేస్తూ భారీ సిక్సర్లు బాదేయగా.. మరో ఎండ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (50: 25 బంతుల్లో 3x4, 5x6) కూడా జోరందుకున్నాడు. దాంతో ఇద్దరూ పోటీపడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు.. జెట్ స్పీడ్‌లో పరుగెత్తింది.
శతక భాగస్వామ్యం
రెండో వికెట్‌కి కేవలం 8.2 ఓవర్లలో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ వర్మ, అభిషేక్ శర్మ జోడి భారత్ జట్టు భారీ స్కోరుకి బాటలు వేసింది. అయితే.. టీమ్ స్కోరు 107 వద్ద హాఫ్ అభిషేక్ ఔటైపోగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), హార్దిక్ పాండ్య (18), రింకూ సింగ్ (8) చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. అయినప్పటికీ.. తిలక్ వర్మ వెనక్కి తగ్గకుండా.. అదే దూకుడుని కొనసాగిస్తూ భారత్ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు.
కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ
డెత్ ఓవర్లలో రమణదీప్ సింగ్ (15: 6 బంతుల్లో 1x4, 1x6) నుంచి లభించిన సపోర్ట్‌తో టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన తిలక్ వర్మ.. భారత్ జట్టు స్కోరు బోర్డుని కూడా 200 దాటించేశాడు. వాస్తవానికి 22 ఏళ్ల తిలక్ వర్మ భారత టీ20 జట్టులోకి వచ్చి ఏడాదే అవుతోంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 19 టీ20లు ఆడిన తిలక్ వర్మ.. 148.06 స్ట్రైక్ రేట్‌తో 496 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.
రూ.8 కోట్లకి ముంబయి రిటేన్
ఐపీఎల్ 2025 సీజన్ కోసం తిలక్ వర్మని ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ.8 కోట్లకి ఇటీవల రిటైన్ చేసుకుంది. గత కొన్ని సీజన్లుగా ముంబయి జట్టులో నిలకడగా ఈ హైదరాబాద్‌కి చెందిన క్రికెటర్ ఆడుతున్నాడు.