Shakib Al Hasan: టీమిండియాతో జరిగే రెండో టెస్టే నా చివరిది.. టీ20లకు గుడ్‌బై.. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షాకింగ్ నిర్ణయం
Shakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాతో జరగబోయే రెండో టెస్టే తన కెరీర్లో చివరి టెస్టు కావచ్చని అతడు చెప్పడం గమనార్హం. అదే సమయంలో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Shakib Al Hasan: బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ స్టార్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ షకీబల్ హసన్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైరవుతున్నట్లు అనౌన్స్ చేశాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ కు కూడా అతడు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఒకవేళ తాను కోరినట్లు మీర్పూర్ లో బంగ్లా క్రికెట్ బోర్డు మ్యాచ్ ఏర్పాటు చేయకపోతే.. ఇండియాతో కాన్పూర్ లో జరగబోయే టెస్టే చివరిది కావచ్చని కూడా షకీబ్ అన్నాడు.
షకీబల్ హసన్ రిటైర్మెంట్
ఇండియా, బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి కాన్పూర్ లో రెండో టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు ముందు గురువారం అతడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు.
ఈ సందర్భంగా తాను అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు షకీబ్ ప్రకటించాడు. తన సొంత మైదానం అయిన మీర్పూర్ లో తాను చివరి టెస్టు ఆడాలని అనుకుంటున్నట్లు కూడా బంగ్లా బోర్డుకు చెప్పానని వెల్లడించాడు.
"మీర్పూర్ లో నా చివరి టెస్టు ఆడాలని అనుకుంటున్నట్లు నేను చెప్పాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇండియాతో జరిగే రెండో టెస్టే నా చివరి మ్యాచ్ కావచ్చు" అని షకీబల్ హసన్ చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది. "బంగ్లాదేశ్ క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అందుకే ఈ ఫార్మాట్ లో నా చివరి మ్యాచ్ సొంతగడ్డపై ఆడాలని అనుకుంటున్నాను" అని షకీబ్ అన్నాడు.
ఇండియాతోనే తొలి టెస్టు
నిజానికి షకీబల్ హసన్ 17 ఏళ్ల కిందట ఇండియాతో తన తొలి టెస్టు ఆడాడు. మే, 2007లో చట్టోగ్రామ్ లో అతడు బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ 70 టెస్టులు ఆడటం విశేషం. వీటిలో 4600కుపైగా రన్స్ చేశాడు. బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మూడో అత్యధికం కావడం విశేషం.
ఇక బౌలింగ్ లోనూ షకీబ్ 242 వికెట్లు తీసుకున్నాడు. టెస్టులలో 200కుపైగా వికెట్లు తీసుకున్న ఏకైక బంగ్లాదేశ్ బౌలర్ గా నిలిచాడు. ఆ దేశం నుంచి వచ్చిన అత్యుత్తమ ఆల్ రౌండర్ అతడు. నిజానికి ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడని చెప్పొచ్చు.
టీ20లకు గుడ్ బై
ఇక షకీబల్ హసన్ అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20 వరల్డ్ కప్ లో తన చివరి మ్యాచ్ ఆడిన అతడు.. ఈ ఫార్మాట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించాడు. అతడు బంగ్లా తరఫున 129 టీ20లు ఆడాడు.
అందులో 2551 రన్స్ చేయడంతోపాటు 149 వికెట్లు కూడా తీశాడు. ఈ ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచే అతని కెరీర్లో చివరి అంతర్జాతీయ టీ20గా మిగిలిపోయింది.