IPL 2024 Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించడంపై అసలు కారణం చెప్పిన ముంబై కోచ్
IPL 2024 Hardik Pandya MI Captain Reason: ఐపీఎల్ 2024కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించడానికి గల కారణాన్ని ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ తాజాగా వెల్లడించాడు. దీంతో కోచ్ మార్క్ బౌచర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
IPL 2024 MI Captain Replace Reason: రెండు నెలల క్రితం ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఊహించినట్లుగానే రోహిత్ శర్మ (Rohit Sharma) అభిమానులకు, సపోర్టర్స్‌కు అంతగా రుచించలేదు. అంతేకాకుండా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తిరిగి జట్టులోకి తీసుకోవాలని కోరారు. అయితే, ప్రజల భావోద్వేగాలను పక్కన పెడితే, ముంబై ఇండియన్స్ పురోగతిని దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నిజానికి.. గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా ఐపీఎల్ ఫైనల్‌కు నడిపించిన తర్వాత భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎమ్ఐకి వెళ్లడానికి కారణం కెప్టెన్సీ పెర్క్ ఒప్పందంలో భాగం అని తెలుస్తోంది. అందువల్ల హార్దిక్ పాండ్యాను కెప్టెన్ నుంచి తొలగించే మార్గం లేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాను తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఎమ్ఐ కోచ్ మార్క్ బౌచర్ తాజాగా వెల్లడించారు.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ చాలా అద్భుతంగా రాణించాడని ముంబై కోచ్ మార్క్ బౌచర్ అన్నారు. "ముంబైకి 5 ట్రోఫీలు అందించడం చాలా పెద్ద విషయం. అవును, ఎంఎస్ ధోనీకి సమానంగా టైటిల్స్ ఉండొచ్చు. కానీ, రోహిత్‌పై కెప్టెన్సీ భారం కారణంగా అతను ఆటగాడిగా రాణించలేకపోయాడు. బ్యాటర్‌గా రోహిత్ శర్మ జట్టుకు మరింత మెరుగ్గా రాణించగలిగాడు. కానీ, కెప్టెన్సీ ప్రెషర్ వల్ల బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఈ కారణంగానే అతను బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు మరింత బెటర్‌గా రాణించాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించటం జరిగింది" అని కోచ్ మార్క్ బౌచర్ తెలిపారు.
"కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా చాలా బాగా రాణిస్తాడు. అతను రెండు ఐపీఎల్ సీజన్‌లలో గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. ఒకసారి ట్రోఫీ కూడా తీసుకొచ్చాడు. ఇలాంటి సమయంలో మేము ట్రేడింగ్ విండోను సద్వినియోగం చేసుకున్నాం. దాని ద్వారా హార్దిక్ పాండ్యాను తిరిగి మా జట్టులోకి ఆహ్వానించాం. ఏది ఏమైనా హార్దిక్ ముంబైలో భాగం అయ్యాడు. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించామో ఆయన అభిమానులకు ఈ కోణం కనిపించదు. అభిమానులు ఎమోషనల్‌గా ఆలోచిస్తారు. ఇది క్రికెట్ నిర్ణయం. ఉద్వేగానికి లోనుకాకుండా రోహిత్ బ్యాటింగ్‌ను ఆస్వాదించండి" అని ముంబై కోచ్ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు.
"2020 నుంచి ఎమ్ఐ ఒక్క టైటిల్ గెలవలేదు. ఆ ఒత్తిడి రోహిత్ ఫామ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2022 రోహిత్ శర్మ చెత్త సీజన్. అతను 14 మ్యాచుల్లో కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు. ఎమ్ఐ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైంది. గత ఏడాది 2023లో రోహిత్ శర్మ 132.80 స్ట్రైక్ రేట్‌తో 332 పరుగులు చేశాడు. క్వాలిఫయిర్స్‌లో ముంబై జట్టు ఓడిపోయినా.. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మపై కెప్టెన్సీ భారాన్ని తొలగించడం చాలా కీలకంగా మారింది" అని ముంబై కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించారు.