Ajit Agarkar: టీమిండియా ‘ట్రంప్ కార్డ్’ అతడే: కోహ్లీ, బుమ్రా కాకుండా వేరే ప్లేయర్ పేరు చెప్పిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్
ODI World cup 2023: వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు ట్రంప్ కార్డ్ ఎవరో చెప్పారు.
ODI World cup 2023: ఆసియాకప్ 2023 టోర్నీని టీమిండియా అద్భుత విజయంతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‍తో మ్యాచ్ మినహా ఆసియాకప్ అంతా భారత జట్టు అద్భుతంగా ఆడింది. సూపర్-4లో పాకిస్థాన్‍పై ఘన విజయం నమోదు చేసుకున్న టీమిండియా.. శ్రీలంకపై తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకుంది. ఇక ఫైనల్‍లో లంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. 10 వికెట్ల తేడాతో 6.1 ఓవర్లలోనే గెలిచింది. ఆసియాకప్‍లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ గెలుచుకున్నాడు. అంతలా అతడు ఈ టోర్నీలో రాణించాడు.
ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్‍తో మ్యాచ్‍లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు భారత స్పిన్నర్ కుల్‍దీప్. ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‍లో నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో భారత్‍లో అక్టోబర్ 5వ తేదీ నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‍లోనూ కుల్‍దీప్‍పై టీమిండియా భారీ అంచనాలు పెట్టుకుంది. కాగా, ప్రపంచకప్ కంటే ముందు సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‍కు జట్టును ప్రకటించే సమయంలో కుల్‍దీప్ యాదవ్ గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడాడు. ప్రస్తుతం టీమిండియాకు కుల్‍దీప్ ట్రంప్ కార్డ్ (కీలకమైన ప్లేయర్/తురుపుముక్క) అని అన్నాడు.
"ఐపీఎల్ సమయంలో అతడితో (కుల్‍దీప్) కొంత సమయం గడిపా. ప్రత్యేకమైన స్కిల్ సెట్ ఉన్న బౌలర్ అతడు. ప్రతీ ప్లేయర్‌పై నమ్మకం ఉంచాలి. టీమిండియా మేనేజ్‍మెంట్ అలాగే చేసింది. ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. అతడే మాకు ట్రంప్ కార్డ్. చాలా జట్లు కుల్‍దీప్ బౌలింగ్‍లో ఆడడాన్ని కష్టంగా భావిస్తున్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నాం” అని అగార్కర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్‍లో కుల్దీప్ యాదవే భారత్‍కు తురుపుముక్క అనేలా అగార్కర్ మాట్లాడాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍లకు కుల్‍దీప్‍కు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చారు. అయితే, మూడో వన్డేకు ఆ నలుగురు తిరిగి జట్టులోకి రానున్నారు. కాగా, చాలా కాలం తర్వాత టీమిండియా వన్డే జట్టులోకి ఆస్ట్రేలియాతో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. భారత్, ఆసీస్ మధ్య సెప్టెంబర్ 22,24,27 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. కాగా, ఇండియా వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ మధ్య వన్డే ప్రపంచకప్ జరగనుంది.