IND vs BAN 2nd Test: కాన్పూర్ టెస్టుకి స్లో పిచ్.. భారత్ తుది జట్టులో ఆ మార్పు తప్పదా?
Kanpur Pitch Report: చెపాక్‌లో గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఫాస్ట్ బౌలర్లు తొలి రెండు రోజులు వికెట్ల పండగ చేసుకున్నారు. ఆ తర్వాత స్పిన్నర్లకి పిచ్ కలిసొచ్చింది. కానీ.. రెండో టెస్టుకి ఆతిథ్యం ఇవ్వబోతున్న కాన్పూర్ పిచ్ మాత్రం భిన్నంగా ఉండబోతోంది.
IND vs BAN 2nd Test Date: భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబరు 27 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టుకి కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గత ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి టెస్టు 4 రోజుల్లోనే ముగియగా.. భారత్ జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉండగా.. సిరీస్‌ను స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి టెస్టులో తేలిపోయిన బంగ్లాదేశ్ కనీసం కాన్పూర్ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది.
చెపాక్ పిచ్ పేస్‌కి అనుకూలించడంతో భారత్ జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఇదే తరహా కాంబినేషన్‌తో ఆడింది. అయితే.. కాన్పూర్ పిచ్ మ్యాచ్ జరిగేకొద్దీ స్లో అవుతుందని వార్తలు వస్తున్నాయి. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్ తక్కువ బౌన్స్, స్పిన్ కోసం నల్లమట్టిని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
స్లో ట్రాక్.. స్పిన్నర్లకి పండగే
ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం గ్రీన్ పార్క్ పిచ్ చెపాక్‌తో పోలిస్తే చాలా తక్కువ బౌన్స్ ఉంటుందట. మ్యాచ్ కొనసాగే కొద్దీ నెమ్మదిగా మారే అవకాశం ఉన్నట్లు రాసుకొచ్చింది. నల్లమట్టి ఉండటమే ఇందుకు ప్రధాన కారణమట.
చెన్నైలోని చెపాక్ టెస్టులో మొదటి రోజు తొలి సెషన్ పూర్తిగా బంగ్లా ఫాస్ట్ బౌలర్లదే పైచేయిగా నిలిచింది. అయితే 3-4 రోజులకి వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు, రవీంద్ర జడేజా 5 వికెట్లతో సత్తాచాటారు. మరోవైపు బంగ్లా స్పిన్నర్లు ఆశించిన మేర బంతిని టర్న్ చేయలేకపోయారు.
తుది జట్టులోకి వచ్చేది ఎవరు?
కాన్పూర్ టెస్టుకి భారత్ తుది జట్టులో మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ఫాస్ట్ బౌలర్‌ను తప్పించి స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్‌లలో ఒకరిని తుది జట్టులోకి ఎంచుకునే అవకాశం ఉంది.
ఈ ఏడాది భారత్ జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లను ఆడనుండటంతో.. ప్రధాన పేసర్లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లో ఒకరికి విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలానే మరో ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్ పేరుని కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఉత్తర్ ప్రదేశ్ తరఫున ఆడుతున్న దయాళ్‌కు కాన్పూర్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.
మూడేళ్ల తర్వాత కాన్పూర్‌లో టెస్టు
కాన్పూర్ స్టేడియం గత ఎనిమిదేళ్లలో టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తుండటం ఇది మూడో సారి మాత్రమే. గతంలో రెండు సందర్భాల్లోనూ న్యూజిలాండ్‌తో టెస్టులే ఇక్కడ జరిగాయి.
2016లో భారత్ 197 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, 2021లో న్యూజిలాండ్ అసాధారణ పోరాటంతో టెస్టును డ్రాగా ముగించింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు టెస్టులు ఐదు రోజుల పాటు సాగాయి. 2016లో జరిగిన టెస్టులో అశ్విన్, జడేజా రూపంలో ఇద్దరు స్పిన్నర్లే ఆడగా.. 2021లో ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు 16 మందితో జట్టుని బీసీసీఐ ప్రకటించింది.
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).