IND vs SA 3rd T20: కుల్దీప్ స్పిన్ వల - మూడో టీ20లో టీమిండియా ఘన విజయం - సిరీస్ సమం
IND vs SA 3rd T20: మూడో టీ20లో సౌతాఫ్రికాను 106 పరుగులు తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 201 పరుగులు చేయగా కుల్దీప్ యాదవ్ స్పిన్ ధాటికి సౌతాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలింది.
IND vs SA 3rd T20: మూడో టీ20లో బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసిన టీమ్ ఇండియా 106 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 201 పరుగులు చేయగా సౌతాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సూర్యకుమార్ సెంచరీతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి 201 పరుగులు భారీ స్కోరు చేసింది.
56 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, ఏడు ఫోర్లతో సూర్యకుమార్ 100 రన్స్ చేశాడు. కెప్టెన్సీ ఒత్తిడి ఉన్నా తనదైన శైలిలో భారీ సిక్సర్లు, ఫోర్లతో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడితో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు.41 బాల్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 రన్స్ చేశాడు.
శుభ్‌మన్ గిల్ (8 రన్స్), తిలక్ వర్మ డకౌట్‌గా వెనుదిరగడంతో 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాను జైస్వాల్, సూర్యకుమార్ కలిసి 200 పరుగులు దాటించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ మినహా మిగిలిన వారు ధారాళంగా పరుగులు ఇచ్చారు. నాలుగు ఓవర్లు వేసిన మహారాజ్ 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
95 పరుగులకే ఆలౌట్...
భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఓవర్‌లోనే బ్రీజ్కెను ఔట్ చేసి సౌతాఫ్రికాకు షాకిచ్చాడు పేసర్ ముఖేష్ కుమార్. హెండ్రిక్స్‌ను సిరాజ్ రనౌట్ చేశాడు. కెప్టెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్ కలిసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు.
మార్‌క్రమ్ (14 బాల్స్‌లో 25 రన్స్), మిల్లర్ (25 బాల్స్‌లో 35 రన్స్) వెంట వెంటనే ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. కుల్దీప్ యాదవ్ స్పిన్ ధాటికి విలవిలలాడిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 13 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చివరి ఐదు వికెట్లను కోల్పోయింది.
టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. 2.5 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చిన కుల్దీప్ 5 వికెట్లు తీసుకున్నాడు. జడేజా రెండు, ముఖేష్‌కుమార్, అర్షదీప్ తలో ఓ వికెట్ తీసుకున్నారు.
టీ20 సిరీస్ సమం...
ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా రెండో టీ20లో సౌతాఫ్రికా విజయాన్ని సాధించింది. మూడో టీ20లో గెలిచి టీ20 సిరీస్‌ను టీమిండియా సమం చేసింది.