IND vs AUS: రోహిత్ ప్లేస్‌లో ఆడిద్దామని గంభీర్ అనుకుంటే..ఒకరేమో డకౌట్, మరొకరు 4 రన్స్‌కే ఔట్, టీమిండియాకి కొత్త తలనొప్పి
KL Rahul: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ అతి త్వరలోనే ప్రారంభంకానుంది. తొలి టెస్టుకి రోహిత్ శర్మ దూరమవనుండగా.. అతని ప్లేస్‌లో ఆడిద్దామనుకుంటున్న ఇద్దరు ప్లేయర్లు ఎలా ఆడుతున్నారంటే?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభ మ్యాచ్‌లకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో ఉండటం లేదు. నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. త్వరలోనే అక్కడికి భారత టెస్టు జట్టులోని ఆటగాళ్లు వెళ్లనుండగా.. ఒక వారం ముందే కేఎల్ రాహుల్‌ను అక్కడికి టీమిండియా మేనేజ్‌మెంట్ పంపించింది.
కేఎల్ రాహుల్ మళ్లీ ఫెయిల్
ప్రస్తుతం మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- ఎ జట్టుతో నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్‌ను భారత్ - ఎ జట్టు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు ఒక వారం ముందే కేఎల్ రాహుల్‌ని పంపిన టీమిండియాకి నిరాశే ఎదురైంది. మ్యాచ్‌లో 4 బంతులాడిన రాహుల్ కేవలం 4 పరుగులే చేసి పేలవంగా ఔటైపోయాడు.
వాస్తవానికి ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకి ముందు రాహుల్ అక్కడి పరిస్థితులకి అలవాటు పడితే.. మొదటి టెస్టులో యశస్వి జైశ్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడించాలనేది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్. కానీ.. రాహుల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగించడంతో భారత్ జట్టుకి కొత్త తలనొప్పి మొదలైంది.
అభిమన్యు మరీ ఘోరంగా
కేఎల్ రాహుల్‌కి పోటీగా ఓపెనర్ రేసులో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ కూడా ఇదే మ్యాచ్‌లో 3 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఈ ఇద్దరిలో ఇప్పుడు ఎవరిని ఆడించాలి? ఒకవేళ ఇద్దరినీ పక్కన పెడితే అప్పుడు జైశ్వాల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించేది ఎవరు? అనేది సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
వాస్తవానికి కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ ఓపెనర్. టెస్టుల్లోనే కాదు.. వన్డేలు, టీ20ల్లోనూ ఓపెనర్‌గా ఆడిన అనుభవం అతనికి ఉంది. అయితే.. పేలవ ఫామ్ కారణంగా ఏ జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20 జట్టుకి దూరమైపోయాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లోనూ అతనిపై చివరి రెండు టెస్టుల్లో వేటు పడింది. ఇప్పుడు రోహిత్ శర్మ జట్టులో లేకపోతే తప్ప.. తుది జట్టులో అవకాశం లభించడం లేదు.
సర్‌ప్రైజ్‌గా జురెల్ హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియా- ఎ మ్యాచ్‌లో సత్తాచాటుతారు అనుకున్న కేఎల్ రాహుల్, ఈశ్వరన్ అభిమన్యు చేతులు ఎత్తేయగా.. రిషబ్ పంత్ రీఎంట్రీ తర్వాత అసలు తుది జట్టు రేసులో లేని వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఈ మ్యాచ్‌లో 186 బంతులాడి 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. దాంతో భారత్ - ఎ జట్టు 57.1 ఓవర్లలో 161 పరుగులైనా చేయగలిగింది.
టీమ్‌లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోయినా.. ధ్రువ్ జురెల్ అసాధారణ పోరాట పటిమని కనబర్చాడు. దాంతో ఓపెనర్‌గా రోహిత్ శర్మ స్థానంలో 23 ఏళ్ల ధ్రువ్ జురెల్‌ను ఆడించమని భారత్ అభిమానులు కోరుతున్నారు. అయితే.. అప్పుడు రిషబ్ పంత్‌తో కలిపి తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు అవుతారు.