India vs Australia: ఆస్ట్రేలియాలో టీమిండియా చిత్తుగా ఓడుతుంది: రికీ పాంటింగ్ జోస్యం
India vs Australia: ఆస్ట్రేలియాలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని ఆ టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ కు గురైన రోహిత్ సేనకు కంగారూ గడ్డపై ఇప్పుడు పెద్ద సవాలే ఎదురు కాబోతోంది.
India vs Australia: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రాబోయే ఐదు టెస్టుల సిరీస్ పై స్పందించాడు. ఈ సిరీస్ లో టీమిండియా 1-3తో చిత్తుగా ఓడుతుందని అతడు అనడం గమనార్హం. చివరి రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో సిరీస్ లు గెలిచి సంచలనం సృష్టించిన ఇండియన్ టీమ్.. ఈసారి మాత్రం స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ కు గురై ఘోర అవమాన భారంతో కంగారూ గడ్డపై అడుగుపెడుతోంది.
టీమిండియా ఒక్క టెస్టు గెలుస్తుంది: పాంటింగ్
ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్ నవంబర్ 22న ప్రారంభం కానుంది. మామూలుగానే ఆ దేశ పర్యటన ఎలాంటి టీమ్ కైనా సవాలే. అలాంటిది టీమిండియా ఇప్పుడు వైట్ వాష్ మిగిల్చిన అవమానంతో వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ టూర్ మరింత కఠినం కాబోతోంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ భవిష్యత్తును నిర్ణయించబోయే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియానే గెలుస్తుందని ఆ టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పష్టం చేస్తున్నాడు.
"ఐదు టెస్టుల సిరీస్ లో ఇండియా ఒక టెస్టు గెలుస్తుందని అనుకుంటున్నాను. కానీ ఆస్ట్రేలియా ఇప్పుడు మరింత సెటిలైందని, మరింత అనుభవం సాధించిందని నేను భావిస్తున్నాను. స్వదేశంలో వాళ్లను ఓడించడం చాలా కష్టం. అందుకే నేను ఇప్పటికీ 3-1 ఫలితానికి కట్టుబడి ఉన్నాను" అని ఐసీసీ రివ్యూలో పాంటింగ్ అన్నాడు.
షమి లేకపోవడం కలిసొచ్చేదే
ఇక టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి జట్టులో లేకపోవడం కూడా ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని ఈ సందర్భంగా పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత అతడు మళ్లీ క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టలేదు. ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. రాబోయే రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో మాత్రం అతడు ఆడే అవకాశం ఉంది.
"ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయి. షమి లేకపోవడం వాళ్లకు తీవ్ర లోటే. షమి ఫిట్ గా ఉంటాడా లేదా అని రెండు నెలల కిందటి వరకూ అనిపించింది. ఇప్పుడు ఇండియాకు 20 వికెట్లు తీసుకోవడం పెద్ద సవాలే. అయితే ఇప్పుడున్న బ్యాటర్లతో వాళ్లు బ్యాటింగ్ మాత్రం బాగా చేస్తారని నాకు అనిపిస్తోంది" అని పాంటింగ్ అన్నాడు.
అయితే షమి విషయంలో పాంటింగ్ అంచనా తప్పని చెప్పొచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఈ పేస్ బౌలర్ పెద్దగా రాణించలేదు. 12 టెస్టుల్లో కేవలం 44 వికెట్లు మాత్రమే తీశాడు. అంతేకాదు 2020-21లో చివరిసారి సిరీస్ గెలిచినప్పుడు కూడా షమి జట్టులో లేడు. ఇప్పుడు కూడా షమి లేకపోవడంతో బుమ్రా, సిరాజ్ లాంటి సీనియర్లతో ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలాంటి యువ బౌలర్లు పేస్ బౌలింగ్ భారాన్ని పంచుకోనున్నారు.