IND vs NZ 3rd Test: మూడో టెస్ట్‌లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ - తొలి ఇన్నింగ్స్‌లో పోరాడుతోన్న టీమిండియా
IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో రిషబ్ పంత్ రికార్డ్ నెలకొల్పాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలతో పంత్, గిల్ టీమిండియాను ఆదుకున్నారు.
IND vs NZ 3rd Test: మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియాను శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను హాఫ్ సెంచరీలతో గట్టెక్కించారు. వన్డే, టీ20 తరహాలో రిషబ్ పంత్ ఫోర్లు సిక్సర్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కేవలం 36 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ధాటిగా ఆడుతోన్న క్రమంలో ఇష్ సోది బౌలింగ్‌లో ఔటయ్యాడు. 59 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడుతూ అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. గిల్ పంత్ కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా టీమిండియా స్కోరును నూట డెబ్బై ఐదు పరుగులు దాటించారు.
ప్రస్తుతం టీమిండియా 41 ఓవర్లలో 190 పరుగులతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. గిల్ 65 రన్స్‌తో, జడేజా ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాంట్ కంటే 45 పరుగుల వెనుకంజలో టీమిండియా ఉంది.
రిషబ్ పంత్ ఎదురుదాడి...
ఒక్క పరుగుతో రెండో రోజు మొదలుపెట్టిన రిషబ్ పంత్ న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సింగిల్స్ కంటే ఫోర్లు, సిక్సర్లు కొట్టడానికే ప్రాధాన్యమిచ్చాడు. అతడి హాఫ్ సెంచరీలో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం గమనార్హం. టెస్ట్ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అతి తక్కువ బాల్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన టీమిండియా క్రికెటర్‌గా రిషబ్ పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
కోహ్లి రనౌట్...
తొలిరోజు 84 పరుగులకే టీమిండియా నాలుగు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 18 పరుగులతో నిరాశపరచగా...విరాట్ కోహ్లి లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. సిరాజ్ డకౌట్‌గా కాగా యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేశాడు.
జడేజా, సుందర్ స్పిన్ ధాటికి...
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్, జడేజా స్పిన్ ధాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైంది. డారి మిచెల్ 84 పరుగులు చేయగా...విల్ యంగ్ 71 పరుగులతో రాణించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకు వెనుదిరిగారు. జడేజా ఐదు వికెట్లు తీసుకోగా...సుందర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.