IND vs ENG 3rd Test Toss: మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా - సర్ఫరాజ్, ధ్రువ్ జురేల్ ఎంట్రీ
IND vs ENG 3rd Test Toss: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది.
IND vs ENG 3rd Test Toss: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్ట్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. రెండో టెస్ట్‌లోని జోరును రాజ్‌కోట్‌లో కొనసాగించాలనే ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. వైజాగ్ టెస్ట్‌లో సత్తా చాటిన శుభ్‌మన్‌గిల్, బుమ్రాపైనే టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది.
వైజాగ్ టెస్ట్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో యశస్వి జైస్వాల్ కీలక భూమిక పోషించాడు. అతడిని కట్టడి చేయకపోతే మరోసారి ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో శుభ్‌మన్‌గిల్ జట్టును ఆదుకున్నాడు. సెంచరీతో టెస్ట్‌లకు పనికిరాడంటూ తనపై వస్తోన్న విమర్శలకు గిల్ సమాధానం ఇచ్చాడు. మూడో టెస్ట్‌లో బ్యాటింగ్ పరంగా టీమిండియాకు వీరిద్దరు కీలకం కానున్నారు.
రోహిత్‌పై అంచనాలు...
ఈ టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ అంచనాలకు తగ్గట్టుగా ఆడకపోవడం ఇబ్బందిగా మారింది. రాజ్‌కోట్‌లో అతడు చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. మిడిల్ ఆర్డర్ సమస్య టీమిండియాను ఇబ్బంది పెడుతోంది. కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చిన రజత్ పాటిదార్ రెండో టెస్ట్‌లో విఫలమయ్యాడు.
వికెట్ కీపర్ భరత్ కోన కీలక సమయాల్లోచేతులు ఎత్తేయడం జట్టుకు ఎదురుదెబ్బగా మారుతోంది. భరత్ కోన ను పక్కన పెట్టేసి ఐపీఎల్ స్టార్ ధ్రువ్ జురేల్ మూడు టెస్ట్‌లో చోటు కల్పించారు టీమ్ మేనేజ్‌మెంట్. గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ప్లేస్‌ను సర్ఫరాజ్‌ఖాన్‌తో భర్తీ చేశారు. మూడో టెస్ట్ తోనే ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్‌ఖాన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు.
జడేజా లోకల్...
బౌలింగ్ పరంగా బుమ్రా, అశ్విన్ జట్టుకు ప్రధాన బలంగా మారారు. వైజాగ్ టెస్ట్‌లో బుమ్రా స్వింగ్ దెబ్బకు ఇంగ్లండ్ కుదేలైంది. రాజ్‌కోట్‌లో బుమ్రాను ఎదురించి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ ఏ మాత్రం క్రీజులో నిలబడతారన్నది చూడాల్సిందే. బుమ్రాకు అశ్విన్ చక్కటి సహకారం అందిస్తున్నాడు. రాజ్‌కోట్ జడేజాకు సొంత మైదానం కావడంతో అతడిపై మూడో టెస్ట్‌లో ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. రెండు టెస్ట్ కు దూరమైన జడేజాతో పాటు సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ను తీసుకున్నారు.
ఇంగ్లండ్ ప్రతీకారం...
వైజాగ్ టెస్ట్ పరాజయం తర్వాత దుబాయ్ వెళ్లిన ఇంగ్లండ్ జట్టు మూడో టెస్ట్ కోసం కఠినంగా కసరత్తులు చేసింది. రాజ్ కోట్‌లో విజయం సాధించి టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇది వందో టెస్ట్ కావడం గమనార్హం. బౌలింగ్ పరంగా మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ మార్పులు చేయబోతున్నట్లు కనిపిస్తోంది.
ఇండియా జట్టు ఇదే
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్‌ఖాన్, , బుమ్రా, అశ్విన్, జడేజా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురేల్
ఇంగ్లండ్ జట్టు ఇదే...
స్టోక్స్, ఓలీ పోప్, రూట్, బెయిర్ స్టో, క్రాలీ, డకెట్, హర్ట్‌లీ, రెహాన్ అహ్మద్, మార్క్‌వుడ్, అండర్సన్, ఫోక్స్