World Cup final IND vs AUS: రోహిత్ అలా చేయాల్సింది కాదు: గవాస్కర్
IND vs AUS Cricket World Cup 2023: ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఔటవడమే కీలకమైన టర్నింగ్ పాయింట్ అని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. వివరాలివే.
IND vs AUS Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ టోర్నీలో సత్తాచాటిన టీమిండియా ఫైనల్‍కు అజేయంగా చేరింది. టైటిల్ ఫైట్‍లో ఆస్ట్రేలియాతో నేడు (నవంబర్ 19) తలపడుతోంది. అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ నేడు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్థాయి తగ్గట్టు రాణించలేకపోయింది. బ్యాటింగ్‍లో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఫైనల్‍లో టాస్ ఒడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన సమయమే టర్నింగ్ పాయింట్ అని భారత మాజీ క్రికెటర్, దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ఈ ఫైనల్ మ్యాచ్‍లోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి టీమిండియాకు అదిరే ఆరంభం ఇచ్చాడు. అయితే, 10 ఓవర్లో మ్యాక్స్ వెల్ బౌలింగ్‍లో భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో రోహిత్ పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్లో అప్పటికే 10 పరుగులు రాగా.. మళ్లీ రోహిత్ భారీ షాట్ ఆడకుండా ఉండాల్సిందని గవాస్కర్ చెప్పారు.
"అదే పెద్ద టర్నింగ్ పాయింట్. రోహిత్ శర్మ అద్భుతంగా కనిపించాడు. మరోసారి తన స్టైల్‍లో ఆడాడు. ఆ ఓవర్లో అప్పటికే సిక్సర్, ఫోర్ - 10 పరుగులు వచ్చాయి. అతడు మరో షాట్ కొట్టేందుకు వెళ్లకుండా ఉండాల్సింది. ఒకవేళ అది సరిగా కనెక్ట్ అయి సిక్సర్ వెళ్లి ఉంటే.. అందరం ఆ షాట్‍ను ప్రశంసించే వాళ్లం. అయితే ఎప్పుడైనా టార్గెట్ చేసి బాదేందుకు 5వ బౌలర్ ఉంటాడు. ఆ సమయంలో తొందరపడి ఉండాల్సింది కాదు" అని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో గవాస్కర్ అన్నారు.
విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) ప్రపంచకప్ ఫైనల్‍లోనూ రాణించారు. అయితే నాన్ రెగ్యులర్ బౌలర్లు వేసిన ఓవర్లలో వారు ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించలేదని గవాస్కర్ అన్నాడు. ట్రావిస్ హెడ్ రెండు ఓవర్లు వేసి నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడని, మిచెల్ మార్ష్ బౌలింగ్‍లోనూ ఎక్కువ పరుగులు రాబట్టలేకపోయారని అన్నారు.
ఆస్ట్రేలియాతో ఫైనల్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 240పరుగులకు ఆలౌటైంది. రాహుల్, కోహ్లీ, రోహిత్ శర్మ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమడంతో ఆస్ట్రేలియాకు పెద్ద టార్గెట్ ఇవ్వలేకపోయింది భారత్.