ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా.. వన్డేలు, టీ20ల్లో మాత్రం టాప్‌లోనే..-icc rankings released team india lost number one spot to australia in tests while remain on top in odis and t20i ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా.. వన్డేలు, టీ20ల్లో మాత్రం టాప్‌లోనే..

ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా.. వన్డేలు, టీ20ల్లో మాత్రం టాప్‌లోనే..

Hari Prasad S HT Telugu
May 03, 2024 02:57 PM IST

ICC Rankings: ఇన్నాళ్లూ మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్ గా ఉన్న టీమిండియా.. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో టెస్టుల్లో టాప్ స్పాట్ కోల్పోయింది. వన్డేలు, టీ20ల్లో మాత్రం ఫస్ట్ ప్లేస్ లోనే కొనసాగుతోంది.

టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా.. వన్డేలు, టీ20ల్లో మాత్రం టాప్‌లోనే..
టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా.. వన్డేలు, టీ20ల్లో మాత్రం టాప్‌లోనే..

ICC Rankings: ఐసీసీ తన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్ ను శుక్రవారం (మే 3) అప్డేట్ చేసింది. వీటిలో టెస్టుల్లో టీమిండియాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా టాప్ లోకి దూసుకెళ్లింది. అయితే వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం ఇండియన్ టీమ్ హవా కొనసాగింది. గతేడాది జరిగిన రెండో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఇండియాను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

టెస్టుల్లో నంబర్ వన్ ఆస్ట్రేలియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తాజా వార్షిక టెస్టు ర్యాంకుల్లో నంబర్ వన్ గా నిలిచింది. గతేడాది జరిగిన ఫైనల్లో 209 రన్స్ తో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా ఈ యానువల్ ర్యాంకింగ్స్ లో 124 రేటింగ్ పాయింట్లతో టాప్ లోకి దూసుకెళ్లింది. ఇక ఇండియా 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఇంగ్లండ్ 100 పాయింట్లతో ఉంది.

టాప్ ర్యాంక్ తప్ప మిగతావాటిలో మార్పు లేదు. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లు నాలుగు నుంచి 9వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. మే 2021 తర్వాత టీమ్స్ ప్రదర్శన ఆధారంగా ఈ యానువల్ ర్యాంకింగ్స్ ను అనౌన్స్ చేశారు.

అంటే మే 2021 నుంచి మే 2023 మధ్య సాధించిన విజయాలకు 50 శాతం వెయిటేజీ ఉండగా.. ఆ తర్వాత 12 నెలల కాలంలో సాధించిన విజయాలకు 100 శాతం ఉంటుంది. ఈ కాలంలోనే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవడంతో ఆ టీమ్ టాప్ లోకి దూసుకెళ్లింది.

వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియా హవా

టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయినా.. వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం టీమిండియా హవా కొనసాగుతోంది. వన్డేలు, టీ20ల్లో మాత్రం నంబర్ వన్ ర్యాంకులోనే ఉంది. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినా వన్డే ర్యాంకుల్లో ఆస్ట్రేలియాపై మరో ఆరు రేటింగ్ పాయింట్లు లీడ్ లో ఉంది. వరల్డ్ కప్ లో వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన ఇండియా.. ఫైనల్లో బోల్తా పడిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా వరుసగా కొన్ని ద్వైపాక్షిక సిరీస్ లలోనూ టీమిండియా గెలుస్తూ వెళ్లింది.

ఇక వన్డేల్లో సౌతాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ నాలుగు, న్యూజిలాండ్ ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ కొనసాగుతున్నాయి. ఇక టీ20 ర్యాంకుల విషయానికి వస్తే ఇండియానే టాప్ లో ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కంటే 11 పాయింట్ల ఆధిక్యంలో టీమిండియా ఉండటం విశేషం. మూడో స్థానంలో ఇంగ్లండ్, నాలుగో స్థానంలో సౌతాఫ్రికా ఉన్నాయి.

ఇక వచ్చే నెలలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలోకి నంబర్ వన్ టీమ్ గా టీమిండియా బరిలోకి దిగనుంది. జూన్ 2 నుంచి జూన్ 29 వరకు వరల్డ్ కప్ జరగనుంది.

Whats_app_banner