Harbhajan on World Cup Team: అసలైన మ్యాచ్ విన్నర్‌నే సెలక్ట్ చేయలేదు: హర్భజన్
Harbhajan on World Cup Team: అసలైన మ్యాచ్ విన్నర్‌నే సెలక్ట్ చేయలేదు అంటూ వరల్డ్ కప్ టీమ్ పై హర్భజన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చహల్ ను ఎంపిక చేయకపోవడంపై అతడిలా స్పందించాడు.
Harbhajan on World Cup Team: వరల్డ్ కప్ కోసం టీమిండియాను ఎంపిక చేయడంతో ఇక ఈ 15 మంది సభ్యుల జట్టుపై విశ్లేషణ మొదలైంది. ఎంపికైన ప్లేయర్స్, మిస్సయిన వారిపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఈ టీమ్ ఎంపిక తర్వాత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్పిన్నర్ చహల్ ను ఎంపిక చేయకపోవడంపై అతడు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
చహల్ ను హర్భజన్ అసలైన మ్యాచ్ విన్నర్ గా అభివర్ణించడం విశేషం. "వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో యుజువేంద్ర చహల్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అసలైన మ్యాచ్ విన్నర్" అని హర్భజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ టీమ్ లోనే కాదు.. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ జట్టులోనూ చహల్ ను సెలక్టర్లు ఎంపిక చేయని విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ జట్టులో కుల్దీప్ తోపాటు జడేజా, అక్షర్ పటేల్ లకు చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానం కుల్దీప్ ఎగరేసుకుపోగా.. జడేజా, అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. నిజానికి ఆసియా కప్ జట్టులోనూ చహల్ కు స్థానం దక్కకపోవడంపై విమర్శలు వచ్చాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మెరుగ్గా రాణిస్తున్న చహల్ ను పక్కనపెట్టడమేంటని క్రికెట్ పండితులు ప్రశ్నించారు.
ఇప్పుడు ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ టీమ్ లోనూ అతనికి చోటు దక్కలేదు. చహల్ తోపాటు మరో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ను కూడా సెలక్టర్లు పట్టించుకోలేదు. అయితే టీమ్ ఎంపికలో మరీ ఆశ్చర్యకర నిర్ణయాలేవీ లేవని కెప్టెన్ రోహిత్ స్పష్టం చేశాడు. "ఆశ్చర్యకర నిర్ణయాలేవీ లేవు. కేవలం 15 మందినే ఎంపిక చేయగలం. నేను కూడా ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించాను. మంచి ఆల్ రౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే బెస్ట్ 15 టీమ్" అని రోహిత్ అన్నాడు.
వన్డేలకు చాలా కాలంగా చహల్, అశ్విన్ దూరంగా ఉన్నారు. టీ20 ఫార్మాట్లో మాత్రం చహల్ ను తీసుకుంటున్నారు. ఇక అశ్విన్ పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. ఈ ఏడాది చహల్ కేవలం 2 వన్డేలు ఆడి 3 వికెట్లు తీశాడు.