India vs Australia 2nd T20: ఆస్ట్రేలియాదే టాస్.. మార్పుల్లేకుండా టీమిండియా.. ఆసీస్ తుదిజట్టులోకి మ్యాక్స్‌వెల్
India vs Australia 2nd T20: ఆస్ట్రేలియాతో టీమిండియా రెండో టీ20 మొదలైంది. ఆసీస్ టాస్ గెలిచింది. తుది జట్టులో మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగగా.. ఆస్ట్రేలియా రెండు ఛేంజెస్ చేసింది.
India vs Australia 2nd T20: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 షురూ అయింది. ఐదు టీ20ల సిరీస్‍లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్.. రెండో పోరుకు హుషారుగా బరిలోకి దిగింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా నేడు (నవంబర్ 26) టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది.
రెండో టీ20 కోసం తుది జట్టులో మార్పులు చేయలేదు భారత్. తొలి మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించింది. ఆస్ట్రేలియా మాత్రం తుది జట్టులో రెండు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తిరిగి ఆసీస్ తుదిజట్టులోకి వచ్చేశాడు. ఆజమ్ జంపాను కూడా ఆస్ట్రేలియా తీసుకుంది. బెహరండాఫ్, ఆరోన్ హార్డీని పక్కనపెట్టింది.
వన్డే ప్రపంచకప్‍లో ఆడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా సహా మరికొందరు సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఆస్ట్రేలియాతో ఈ టీ20 సిరీస్‍లో భారత యువ ఆటగాళ్లకు ఛాన్స్ దక్కింది. ఈ సిరీస్‍లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. తొలి మ్యాచ్‍లో భారీ స్కోరును ఛేదించి సత్తాచాటింది భారత్. ఈ రెండో టీ20లోనూ గెలిచి ఐదు మ్యాచ్‍ల సిరీస్‍లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ గెలిచిన విన్నింగ్ కాంబినేషన్‍నే కొనసాగించింది.
కెప్టెన్సీ తనకు కొత్త ఛాలెంజ్, బాధ్యతగా ఉందని, అయితే దాన్ని ఎంజాయ్ చేస్తున్నానని టాస్ సమయంలో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. గత మ్యాచ్ తమకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని అన్నాడు. మొదటి మ్యాచ్ జట్టునే ఈ రెండో టీ20కి కూడా కొనసాగిస్తున్నామని అన్నాడు.
భారత తుది జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆస్ట్రేలియా తుది జట్టు: స్టీవెన్ స్మిత్, మాథ్యు షార్ట్, జోస్ ఇంగ్లిస్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యు వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎలిస్, ఆజమ్ జంపా, తన్వీర్ సంఘా