Ind vs Aus T20: ఆస్ట్రేలియాకు సూర్య, రింకు పంచ్.. చివరి బంతికి టీమిండియాకు రికార్డు విజయం-ind vs aus t20 india beat australia by 5 wickets in first t20i ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus T20: ఆస్ట్రేలియాకు సూర్య, రింకు పంచ్.. చివరి బంతికి టీమిండియాకు రికార్డు విజయం

Ind vs Aus T20: ఆస్ట్రేలియాకు సూర్య, రింకు పంచ్.. చివరి బంతికి టీమిండియాకు రికార్డు విజయం

Hari Prasad S HT Telugu
Nov 23, 2023 10:53 PM IST

Ind vs Aus T20: ఆస్ట్రేలియాపై కెప్టెన్ సూర్యకుమార్ తన ప్రతాపం చూపించాడు. చివర్లో రింకు తనదైన ముగింపు ఇచ్చాడు. దీంతో కంగారూలను తొలి టీ20లో చిత్తుగా ఓడించింది టీమిండియా. టీ20ల్లో ఇండియన్ టీమ్ కు ఇదే అత్యధిక చేజ్ కావడం విశేషం.

సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (PTI)

Ind vs Aus T20: కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే టీమిండియాకు కళ్లు చెదిరే విజయం సాధించి పెట్టాడు సూర్యకుమార్ యాదవ్. ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాదాడు. అయితే చివరి ఓవర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో పెద్ద డ్రామా నెలకొంది. చివరికి రింకూ సింగ్ ఇండియాను 2 వికెట్లతో గెలిపించాడు. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ లో ఇండియా 1-0 లీడ్ సాధించింది.

చివరి ఓవర్లో 7 పరుగుల అవసరం కాగా.. తొలి బంతికే రింకు ఫోర్ కొట్టాడు. అయితే తర్వాత ఇండియా వరుసగా మూడు వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఒక పరుగు చేయాల్సి వచ్చింది. రింకు తనదైన స్టైల్లో సిక్స్ తో ముగించాడు. అయితే అది నోబాల్ కావడంతో రింకు సిక్స్ ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రింకు సింగ్ 14 బంతుల్లోనే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. 209 రన్స్ టార్గెట్ చేజ్ చేయడం టీ20ల్లో ఇండియాకు ఇదే తొలిసారి కావడం విశేషం.

సూర్యకుమార్ 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్ లతో 80 రన్స్ చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు. అయితే అప్పటికే అతడు ఆస్ట్రేలియాకు చేయాల్సిన నష్టం చేసేశాడు. ఇషాన్ కిషన్ కూడా 39 బంతుల్లోనే 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 58 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 112 పరుగులు జోడించి.. ఇండియా విజయాన్ని ఖాయం చేశారు. చివర్లో ఫినిషర్ రింకు సింగ్.. మిగిలిన పని పూర్తి చేశాడు.

209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే ఓ ఫోర్, సిక్స్ తో మంచి ఆరంభం ఇచ్చాడు యశస్వి జైస్వాల్. అయితే ఐదో బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించిన యశస్వి.. అవతలి వైపు ఉన్న రుతురాజ్ ను డైమండ్ డకౌట్ చేశాడు. అతడు ఒక్క బంతి కూడా ఆడకుండానే పెవిలియన్ కు చేరాడు. తర్వాత కాసేపటికే ఊపు మీద కనిపించిన యశస్వి కూడా 8 బంతుల్లో 21 రన్స్ చేసి ఔటయ్యాడు.

దీంతో 22 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో జత కలిసి ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తనకెంతో ఇష్టమైన టీ20 ఫార్మాట్ లో తనదైన స్టైల్లో వచ్చీ రాగానే చెలరేగాడు సూర్యకుమార్ యాదవ్. కాసేపటి తర్వాత ఇషాన్ కిషన్ కూడా తన సత్తా ఏంటో చూపించాడు. వరుస బౌండరీలు బాదుతూ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఇంగ్లిస్.. విశ్వరూపం

అంతకుముందు జోష్ ఇంగ్లిస్ మెరుపు సెంచరీకి తోడు స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 రన్స్ చేసింది. ఈ ఇద్దరూ చితగ్గొట్టడంతో టీమిండియాలోని ప్రతి బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముకేశ్ కుమార్ మాత్రమే 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చాడు. అతడు చివరి ఓవర్లో కేవలం 5 రన్స్ మాత్రమే ఇవ్వడంతో ఆస్ట్రేలియా కాస్త తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఈ మ్యాచ్ లో జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు కేవలం 47 బంతుల్లోనే అంతర్జాతీయ క్రికెట్ లో తన తొలి సెంచరీ నమోదు చేయడం విశేషం. చివరికి 50 బంతుల్లోనే ఏకంగా 110 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇంగ్లిస్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్స్ లు ఉన్నాయి. ఐదో ఓవర్లో 31 పరుగుల దగ్గర షార్ట్ (13) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లిస్.. భారత బౌలర్లను చితకబాదాడు.

గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. మరోవైపు ఓపెనర్ గా వచ్చిన స్మిత్ కూడా అడపాదడపా బౌండరీలు బాదాడు. అతడు 41 బంతుల్లోనే 8 ఫోర్లతో 52 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 67 బంతుల్లోనే 130 పరుగులు జోడించారు. చివరికి స్మిత్ రనౌట్ కావడంతో వీళ్ల భాగస్వామ్యానికి తెరపడింది. నిజానికి 36 పరుగుల దగ్గరే ఇంగ్లిస్ ను రనౌట్ చేసే అవకాశాన్ని రవి బిష్ణోయ్ జారవిడవడం టీమిండియా కొంప ముంచింది.

ఇంగ్లిస్, స్మిత్ దెబ్బకి ఇండియా బౌలర్లు రవి బిష్ణోయ్ 4 ఓవర్లలోనే 54, ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలోనే 50 పరుగులు సమర్పించుకున్నారు. చివర్లో టిమ్ డేవిడ్ 13 బంతుల్లో 19, స్టాయినిస్ 6 బంతుల్లో 7 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

Whats_app_banner