World Cup Tickets: గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 4 లక్షల వరల్డ్ కప్ టికెట్లు
World Cup Tickets: గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 4 లక్షల వరల్డ్ కప్ టికెట్లు రానున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. శుక్రవారం (సెప్టెంబర్ 8) నుంచే ఈ టికెట్లను కొనుగోలు చేయొచ్చు.
World Cup Tickets: వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే తొలి దశ టికెట్ల అమ్మకాలు పూర్తి కాగా.. వీటికి విక్రయించిన తీరుపై అభిమానులు అటు బీసీసీఐ, ఇటు బుక్ మై షోలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మరో దశ టికెట్ల అమ్మకాలకు బోర్డు తెరతీసింది.
శుక్రవారం నుంచి మరో 4 లక్షల వరల్డ్ కప్ టికెట్లు అందుబాటులోకి తేనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ టికెట్లు అన్ని వరల్డ్ కప్ మ్యాచ్ లకు సంబంధించినవి. శుక్రవారం (సెప్టెంబర్ 8) రాత్రి 8 గంటల నుంచి ఈ టికెట్లను కొనుగోలు చేసే వీలుంటుందని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. తర్వాతి దశలో టికెట్ల అమ్మకాల గురించి కూడా అభిమానులకు ముందుగానే చెబుతామని బోర్డు చెప్పింది.
నిజానికి ఇలా దశల వారీగా టికెట్ల అమ్మకాలు ఉంటాయని బోర్డు చెప్పలేదు. కానీ తొలి దశలో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండటం, అందుబాటులో ఉన్న టికెట్లు నిమిషాల్లో అమ్ముడైపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి సెప్టెంబర్ 3తోనే లీగ్ స్టేజ్ కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ముగిశాయి. అయితే బీసీసీఐ తాజా ప్రకటనతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
అసలు వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజే చాలా ఆలస్యంగా చేశారు. టోర్నీకి కేవలం 100 రోజుల ముందే షెడ్యూల్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత కూడా దానికి మార్పులు చేయడంతో టికెట్ల అమ్మకాలు కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. టికెట్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మ్యాచ్ లను నిర్వహించే ఆయా రాష్ట్రాల అసోసియేషన్లతో మాట్లాడిన తర్వాత మరో దశ టికెట్ల అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తాజా ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది.
2019 వరల్డ్ కప్ సందర్భంగా ఆతిథ్య ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సుమారు ఆరు నెలలు ముందుగానే టికెట్ల అమ్మకాలు ప్రారంభించింది. 2019, మార్చిలో టోర్నీ ఉండగా.. 2018, సెప్టెంబర్ లోనే టికెట్లను విక్రయించారు.
వరల్డ్ కప్ అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నవంబర్ 19న ఇదే స్టేడియంలో జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది. సెమీఫైనల్స్, ఫైనల్ కు సంబంధించిన టికెట్లను ఇంకా రిలీజ్ చేయలేదు. ఇవి సెప్టెంబర్ 15న అందుబాటులోకి వస్తాయి.