Zomato and Swiggy : కస్టమర్లకు జొమాటో, స్విగ్గీ షాక్.. ఆర్డర్‌పై ఛార్జీలు పెంచిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్
Zomato and Swiggy Rates Hike : ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ అయిన జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. ఆర్డర్లపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఛార్జీలను పెంచడంతో స్విగ్గీ కూడా పెంచింది. ఇప్పుడు స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం కాస్త ఖరీదైనదిగా మారింది. జొమాటో మొదట ఫ్లాట్ ఛార్జీని రూ .5 నుండి రూ .6కు పెంచింది. ఆ తర్వాత స్విగ్గీ కూడా పెరిగింది. ఇకపై రెండు కంపెనీల కస్టమర్లు ప్రతి ఆర్డర్‌పై రూ.6 ప్లాట్ ఫామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్డీటీవీ నివేదిక ప్రకారం, జొమాటో, స్విగ్గీ కంపెనీలు బెంగళూరు, దిల్లీ వంటి మార్కెట్లకు ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచాయి. మూడు నెలల క్రితం ఈ రెండు కంపెనీలు ప్లాట్ ఫాం ఫీజును రూ.5కు పెంచాయి. లాభదాయకతను పెంచుకునేందుకు జొమాటో, స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత ఏడాది నుంచి ఈ రెండు కంపెనీలు ప్లాట్ ఫాం ఫీజులు వసూలు చేయడం ప్రారంభించాయి.
మొదట్లో ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్స్ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.2 వసూలు చేసేవి. తర్వాత దాన్ని 3 రూపాయలకు, ఆ తర్వాత 4 రూపాయలకు పెంచాయి. అనంతరం 5 రూపాయలు, ఇప్పుడు ఒక రూపాయి పెంచి.. ఆరు రూపాయలుగా చేశాయి.
జొమాటో షేర్లు
తాజాగా సరికొత్త ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి జొమాటో షేర్లు. ఉదయం రూ.225 వద్ద ప్రారంభమైన సూచీ రూ.232 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. గత 5 రోజుల్లో 8 శాతానికి పైగా రాబడులు ఇచ్చింది. ఈ స్టాక్ ఒక నెలలో 20 శాతం, ఆరు నెలల్లో 70 శాతం, ఈ ఏడాది ఇప్పటివరకు 83 శాతానికి పైగా పెరిగింది. షేర్లు, ప్లాట్‌ఫామ్ ఛార్జీలు పెరగడంతో జొమాటో సీఈఓ బిలియనీర్ క్లబ్‌లో చేరారు. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.98 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో స్విగ్గీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టలేదు.
గత రెండేళ్లుగా జొమాటో షేర్లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. 2022 జూలై 27న బీఎస్ఈలో జొమాటో షేరు ధర రూ.40.55. ఇది ఈ షేరుకు ఆల్ టైమ్ కనిష్టం. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.232కు చేరుకుంది. అంటే, కనిష్ట స్థాయి నుంచి చాలా రాబడిని అందించింది. రెండేళ్లలోనే ఈ షేరు విలువ దాదాపు చాలా రెట్లు పెరిగింది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
జొమాటో షేర్ గ్రోత్ ను చూస్తున్న ఇన్వెస్టర్లకు పలువురు మార్కెట్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. జొమటో షేరు విలువ ఇంకా పెరిగే అవకాశముందని, ఇన్వెస్టర్లు ఇప్పటికీ, దీనిపై పెట్టుబడులు పెట్టవచ్చని సూచిస్తున్నారు. భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ టెక్ ప్లాట్ ఫామ్‌లలో జొమాటో ఒకటి అన్న విషయం తెలిసిందే.