US Fed rates Hike: వడ్డీ రేటు పెంపు: యూఎస్ ఫెడ్ కామెంట్లు - స్టాక్ మార్కెట్లలో గుబులు!
US Fed Interest rates Hike యూఎస్ ఫెడ్ మరోసారి వడ్డీరేటును పెంచింది. దీంతో పాటు ఫెడ్ చైర్మన్ పావెల్ కీలక కామెంట్లు చేశారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లలో టెన్షన్ మొదలైంది. భారత మార్కెట్లపై ఫెడ్ రేట్ ఎందుకు ప్రభావం చూపిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
US Fed Interest Rates Hike: అమెరికా సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) కీలక వడ్డీ రేటును మరోసారి పెంచింది. 50 బేసిస్ పాయింట్లు అంటే 0.5 శాతం అధికం చేసింది. దీంతో 4.25 - 4.50 శాతానికి ఫెడ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు చేరింది. గత 15 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. గత నాలుగుసార్లు 75 బేసిస్ పాయింట్లు పెంచిన ఫెడ్.. ఈ సారి 50 పాయింట్లను అధికంగా చేసింది. పాలసీ సమావేశ నిర్ణయాలను యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ (జెరోమ్ పావెల్) వెల్లడించారు. వడ్డీ రేటు పెంపు కాస్త మందగిచినట్టు కనిపించినా.. ఆయన చేసిన కామెంట్లు మాత్రం మార్కెట్లలో గుబులు పుట్టిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో ప్రతికూలత కనిపిస్తోంది. అసలు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఏ కామెంట్లు చేశారు.. ఫెడ్ వడ్డీ రేట్లు భారత మార్కెట్లపై ఎలా ప్రభావం చూపిస్తాయో ఇక్కడ తెలుసుకోండి.
భవిష్యత్తులో మరింత..
US Fed Interest Rates Hike: అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివస్తుండటంతో యూఎస్ ఫెడ్.. వడ్డీ రేట్ల విషయంలో వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు. ముందుగా ఊహించినట్టే ఈసారి 50 బేసిస్ పాయింట్లను పెంచింది. అయితే, భవిష్యత్తులోనూ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని మీడియా సమావేశంలో ఫెడ్ చైర్మన్ పావెల్ వెల్లడించారు. అమెరికాలో ఇంకా ద్రవ్యోల్బణం అధికంగానే ఉందని, దీన్ని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లను పెంచడమే మార్గమేనేలా కామెంట్లు చేశారు. దీంతో తదుపరి కూడా వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించే అవకాశం లేదని స్పష్టత వచ్చింది. దీంతో మార్కెట్లలో ప్రతికూలత నెలకొంది. సమీప భవిష్యత్తులో వడ్డీ రేటు కోత ఉంటుందన్న ఆశలు సన్నగిల్లాయి.
5.25 శాతం వరకు..
US Fed Interest Rates Hike: తాజా పెంపుతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు 4.25 - 4.5 శాతానికి పెరిగింది. 15 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. అయితే వచ్చే ఏడాది ముగింపులోగా ఈ వడ్డీ రేటు 5 శాతం - 5.25 శాతం రేంజ్ చేరుతుందని ఫెడ్ చైర్మన్ పావెల్ అంచనా వేశారు. అంటే ఇంకా మూడు త్రైమాసికాల వరకు వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనే లేదనేలా ఆయన సంకేతాలు ఇచ్చారు.
ఈ ఏడాది జూన్‍లో అమెరికాలో 9.1 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం. అయితే నవంబర్ నాటికి 7.1 శాతానికి దిగివచ్చింది. అయితే ఇది కూడా ఎక్కువేనని ఫెడ్ భావిస్తోంది. ఈ ఏడాది చివరికి 5.6 శాతానికి, 2023 ముగింపు నాటికి 3.1 శాతానికి అమెరికా ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఫెడ్ చైర్మన్ అంచనా వేశారు. సాధారణంగా ద్రవ్యోల్బణం 2 శాతం కంటే తక్కువగా ఉండాలనేది ఫెడ్ లక్ష్యం. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేటు పెంపుకే ఫెడ్ మొగ్గు చూపేలా కనిపిస్తోంది. సప్లయ్, డిమాండ్‍లో సమతుల్యత ఇంకా లేదని, ఆహార పదార్థాలు, చమురు ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని ఫెడ్ కామెంట్ చేసింది.
భారత మార్కెట్లపై ప్రభావం ఎలా..
US Fed Interest Rates Hike: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే బాండ్ ఈల్డ్‌లు అధికమవుతాయి. దీంతో రాబడి కోసం అమెరికా బాండ్లలో పెట్టుబడికి మదుపరులు ఆసక్తి చూపుతారు. సాధారణంగా స్టాక్ మార్కెట్లతో పోలిస్తే బాండ్లు సురక్షితమైన పెట్టుబడిగా ఉంటాయి. దీంతో ఫెడ్ వడ్డీ రేటును పెంచితే.. అమెరికా ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకొని.. వారి దేశంలోని సొంత దేశ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. ఇందుకోసం భారత స్టాక్ మార్కెట్‍లలో పెట్టుబడులు తగ్గించుకుంటారు. మరోవైపు, ఫెడ్ వడ్డీ రేట్లు అధికం చేస్తే.. డాలర్ విలువ పెరుగుతుంది. తద్వారా డాలర్ పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతుంది. ఇందువల్ల కూడా విదేశీ మదుపరులు భారత మార్కెట్లలో పెట్టుబడులు తగ్గించుకునేందుకు మొగ్గుచూపుతారు. భారత మార్కెట్లపైనే కాకుండా అమెరికాతో పాటు అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లపై ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ఉంటుంది.
టాపిక్