Adani Shares Fall : అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. భారీ పతనం.. కానీ ఇవి మాత్రం లాభాల్లోకి-stock market hindenburg effect adani groups stocks including adani enterprises fall but this adani shares rise ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Shares Fall : అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. భారీ పతనం.. కానీ ఇవి మాత్రం లాభాల్లోకి

Adani Shares Fall : అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. భారీ పతనం.. కానీ ఇవి మాత్రం లాభాల్లోకి

Anand Sai HT Telugu
Aug 12, 2024 05:36 PM IST

Stock Market : సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ షేర్లు పడిపోయాయి. అందరూ ఊహించినట్టుగానే ఈ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్ పడింది. నిపుణులు సైతం అదానీ షేర్లు పడిపోతాయని ముందుగానే అంచనా వేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత తొలి ట్రేడింగ్ రోజున భారత స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 56.99 పాయింట్లు లేదా 0.07శాతం నష్టపోయి 79,648.92 వద్ద, నిఫ్టీ 50 20.50 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 24,347 వద్ద ముగిశాయి. మధ్యాహ్నం వరకు భారీ నష్టాల్లో ఉన్న సూచీలు ఆ తర్వాత కొంతమేర నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ స్టాక్స్‌లో ప్రోత్సాహకరమైన పోకడలు, విదేశీ కరెన్సీ తాజా ప్రవాహం రికవరీకి తర్వాత సహాయపడింది.

నిఫ్టీలో హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ వంటివివాటికి లాభాలు ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధంగా ఎన్‌టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాల్లో ముగిశాయి.

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. రంగాల వారీగా చూస్తే, ఎఫ్‌ఎంసీజీ, పవర్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు, మీడియా రంగాలు 0.5-2 శాతం క్షీణించాయి. బ్యాంకింగ్, టెలికాం, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, రియల్టీ 0.3-1 శాతం లాభపడ్డాయి.

పడిపోయిన అదానీ షేర్లు

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు వరుసగా 2.33 శాతం, 1.46 శాతం నష్టపోయాయి. అదానీ విల్మార్ - రూ.369.35 (-4.10శాతం), అదానీ టోటల్ గ్యాస్ - రూ.835.50 (-3.95శాతం), అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ - రూ.1,067.90 (-3.25శాతం), అదానీ పోర్ట్స్ - రూ.1,438% (-2 శాతం), ACC సిమెంట్ - రూ.2,329 (-0.96శాతం), అదానీ ఎంటర్‌ప్రైజెస్ - రూ.3,140.90 (-1.46శాతం), అదానీ పవర్ - రూ.687 (-1.21శాతం), NDTV - రూ.203.50 (-2.32శాతం) పడిపోయాయి.

ఈ షేర్లు పెరుగుదల

అయితే అదే సమయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్స్ స్వల్ప లాభాలతో ముగిశాయి.

ఏంటీ ఆరోపణలు

సెబీ ఛైర్‌పర్సన్ మధవి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ రహస్యంగా అదానీకి సంబంధించిన విదేశీ కంపెనీలలో వాటాలను కలిగి ఉన్నారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అయితే అదానీ గ్రూప్, మాధవి మాత్రం ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తున్నాయి. కానీ ఈ ప్రభావం మాత్రం అదానీ షేర్లపై పడింది.

పెరిగిన రైల్వే షేర్లు

మరోవైపు రైల్వే షేర్లు ఊపందుకున్నాయి. రూ.24,657 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రైల్వే స్టాక్స్ గణనీయంగా పెరిగాయి. లాభపడిన వాటిలో RVNL (రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్) 11 శాతం లాభంతో అత్యుత్తమంగా నిలిచింది. ఇటలీకి చెందిన పియాజియో గ్రూప్‌కు చెందిన భారత విభాగంతో చేసుకున్న ఎంఓయూ నేపథ్యంలో అమర రాజా బ్యాటరీస్ 6 శాతం పెరిగింది. సుస్లాన్ ఎనర్జీ తన ఎగువ సర్క్యూట్ పరిమితిని వరుసగా నాల్గో రోజు తాకి 5 శాతంతో ముగిసింది.