Recession: 2022 కన్నా ఈ ఏడాది మరింత కఠిన పరిస్థితులు: ఐఎంఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు.. ఆ దేశాలపై ఎక్కువ ఎఫెక్ట్!
Recession 2023: ఆర్థిక మాంద్యంపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా (IMF Chief Kristalina Georgieva) కీలక వ్యాఖ్యలు చేశారు. 2023లో పరిస్థితి మరింత కఠినంగా ఉంటుందని పేర్కొన్నారు. మరికొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించారు.
Recession 2023: ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో ఉంది. 2022లో అనేక దేశాలు చాలా ఒడిదొడుకులను చూశాయి. వృద్ధి నెమ్మదించటం, ద్రవ్యోల్బణం పెరగటం, వడ్డీ రేట్ల పెంపుతో పాటు చాలా విషయాలు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో ఆర్థిక మాంద్యం తప్పదనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే 2022 కన్నా 2023లోనే ఆర్థిక మాంద్యం ఎక్కువగా ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (International Monetary Fund - IMF) చీఫ్ వెల్లడించారు. ఏ దేశాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందో కూడా చెప్పారు.
Recession 2023: మూడో వంతు మాంద్యంలోనే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ (Global Economy) మూడో వంతు 2023లో మాంద్యంలోనే ఉంటుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా అంచనా వేశారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU), చైనా దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి మరింత మందగిస్తుందని, ఆ దేశాలకు 2023 మరింత కఠినంగా మారుతుందని హెచ్చరించారు. సీబీఎస్ న్యూస్ నిర్వహించిన ఫేస్ ది నేషన్ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, మాంద్యం గుప్పిట్లో లేని దేశాలు కూడా.. ఈ ప్రభావాన్ని ఫీలవుతాయని పేర్కొన్నారు.
10 నెలలుగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కొలిక్కి వచ్చేలా కనిపించకపోవటం, ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడం, వడ్డీ రేట్లు పెరుగుదల, చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ విజృంభిస్తుండటంతో మాంద్యం భయాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు ఆర్థిక మాంద్యంలోనే ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం” అని క్రిస్టాలినా అన్నారు. 2023లో వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ గత అక్టోబర్లోనే తగ్గించింది.
“2021లో ప్రపంచ వృద్ధి రేటు 6గా అంచనా వేశాం. 2022 నాటికి దాన్ని 3.2కు తగ్గించాం. ఇక 2023లో వృద్ధి 2.7 శాతంగా ఉంటుందని మా అంచనా. కొవిడ్-19 తొలి దశ వచ్చిన సంవత్సరం మినహా 2001 తర్వాత ఇదే అత్యంత బలహీనమైన వృద్ధి” అని క్రిస్టాలినా అన్నారు.
“తర్వాతి రెండు నెలలు చైనాకు చాలా కీలకంగా ఉన్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ఉంటుంది. ఇది ఆ ప్రాంతంలోనే కాక.. ప్రపంచ వృద్ధిపై కూడా నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.
అమెరికా ఫెడ్ కూడా తాము భవిష్యత్తులోనూ కీలక వడ్డీ రేటును పెంచుతామని ఇప్పటికే స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావడమే లక్ష్యమని వెల్లడించింది. చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి.