Gold ETF : ఇదే బంగారంలాంటి పెట్టుబడి.. ఆభరణాలు కొనడం కంటే బెటర్ ఆప్షన్-reasons why gold etf investment is better than physical gold check complete details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Etf : ఇదే బంగారంలాంటి పెట్టుబడి.. ఆభరణాలు కొనడం కంటే బెటర్ ఆప్షన్

Gold ETF : ఇదే బంగారంలాంటి పెట్టుబడి.. ఆభరణాలు కొనడం కంటే బెటర్ ఆప్షన్

Anand Sai HT Telugu
Jul 09, 2024 12:49 PM IST

Gold ETF Investment : చాలామంది బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు. కానీ ఇక్కడే చేసే తప్పు ఏంటంటే.. దానిని ఫిజికల్‌గా కొని బీరువాలో దాచిపెట్టడం. ఇలా చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెడితే చాలా ప్రయోజనం ఉంటుంది.

గోల్డ్ ఈటీఎఫ్
గోల్డ్ ఈటీఎఫ్ (Unsplash)

ఇన్వెస్ట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా ఒక మంచి మార్గం. అయితే బంగారంలో పెట్టుబ‌డులు పెట్టే ముందు అనేక విష‌యాలు గుర్తుంచుకోవాలి. బంగారం ధర నానాటికీ పెరుగుతుండడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం చాలా మందికి అసాధ్యం. కానీ బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఒక ఎంపిక ఉంది. అదే గోల్డ్ ఈటీఎఫ్.

గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏమిటి? బంగారు ఆభరణాలకు బదులుగా ETFలలో ఎలా పెట్టుబడి పెట్టాలి? మొదలైన వాటి గురించి మరింత తెలుసుకోండి. గోల్డ్ ఈటీఎఫ్‌లు(గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌). ఇది మ్యూచువల్ ఫండ్స్‌ను పోలి ఉంటుంది. కమోడిటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్‌లు అన్న మాట. ఇది బంగారంలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ స్టాక్స్ లాగా పనిచేస్తాయి.

వాటిని BSE, NSE వంటి ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు డీమెటీరియలైజ్డ్ రూపంలో మీ డీమ్యాట్ ఖాతాకు జమ చేసి ఉంటాయి. మీరే నేరుగా వాటిని కొనుగోలు చేయవచ్చు. మీరు భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. అయితే దీని ధర US మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటుంది.

ఒక వ్యక్తి కేవలం ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది 99.5 శాతం స్వచ్ఛత కలిగిన ఒక గ్రాము బంగారంతో సమానం. ఇందులోని మరో మంచి విషయం ఏమిటంటే, బంగారు ఆభరణాల మాదిరిగా కాకుండా, దాని భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దొంగతనం జరిగే ప్రమాదం లేదు. అలాగే పరిశుభ్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆభరణాలు కాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు ప్రత్యామ్నాయ ఎంపిక. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్ వంటి లాక్ ఇన్ పీరియడ్ కూడా ఉండదు.

ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు, దాని గత ట్రాక్ రికార్డును చూడటం మంచిది. ప్రధాన గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు గత ఐదేళ్లలో సగటున 16.73 శాతం రాబడిని ఇచ్చాయి. గత ఏడాదిలో రాబడి 17.73 శాతం కాగా, గత మూడేళ్లలో సగటు వార్షిక రాబడి 13.59 శాతంగా ఉందని గమనించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఎంత పెట్టుబడిని కేటాయించాలి? మీ పోర్ట్‌ఫోలియో కూడా విభిన్నంగా ఉండాలి. మీరు వివిధ వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఈక్విటీ, బంగారం, డెట్‌లలోకి మళ్లిస్తే, అది మీ నష్టాన్ని తగ్గిస్తుంది.

మీ పోర్ట్‌ఫోలియోలో 10 నుంచి 15 శాతం బంగారం ఉండాలి అని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. బంగారం కొన్నిసార్లు మంచి రాబడిని ఇవ్వకపోవచ్చు. ప్రతి పెట్టుబడిలాగే బంగారం ధరకూ ఒక చక్రం ఉంటుంది. సాధారణంగా యుద్ధం లేదా ఇతర సంఘటనలు వంటి ప్రపంచ అనిశ్చితి ఉన్నప్పుడు, బంగారం ధర పెరుగుతుంది. బంగారం దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇవ్వగలదు. బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు గోల్డ్ ఈటీఎఫ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Whats_app_banner