Paytm job cuts?: పేటీఎం నుంచి 20 శాతం ఉద్యోగుల తొలగింపు!; అదేం లేదంటున్న సంస్థ
Paytm job cuts?: సంక్షోభంలో ఉన్న పేటీఎం దాదాపు 20% ఉద్యోగులను తొలగించబోతోందన్న వార్తలు సంబంధిత వర్గాల్లో వినిపిస్తోంది. ఆదాయం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపు తప్పనిసరి అవుతోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఉద్యోగుల తొలగింపు ఆలోచన లేదని పేటీఎం చెబుతోంది.
Paytm crisis: పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా అన్ని విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు, ముఖ్యంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) నుంచి లే ఆఫ్స్ కొనసాగుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎంతమంది ఉద్యోగులను తొలగించబోతున్నారన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ.. కొన్ని విభాగాలు టీమ్ సైజులను 20 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ వార్త సంస్థ నుంచి అధికారికంగా వెలువడలేదు.
సాధారణ ప్రక్రియనే..
ప్రతీ సంస్థలో అప్రైజల్ సైకిల్, తదనంతర పరిణామాలు సాధారణమేనని, పేటీఎం (Paytm) లో కూడా రొటీన్ సమీక్షలు జరుగుతున్నాయని సంస్థ వెల్లడించింది. అప్రైజల్ సైకిల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని పేటీఎం సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గుచూపడం వల్ల వివిధ విభాగాల ఉద్యోగాల తొలగింపు తప్పని సరి అవుతోందని వివరించారు. ఏ సంస్థలోనైనా పనితీరు మదింపు సాధారణమేనని, ఆ అప్రైజల్ ఆధారంగా సర్దుబాట్లు ఉంటాయని తెలిపారు. అయితే, 2024 జనవరిలో సైలెంట్ లే ఆఫ్స్ జరిగాయని, రాబోయే కోతలకు పనితీరుతో సంబంధం లేదని ఒక ఉద్యోగి ఆరోపించారు.
ఏఐ ప్రభావం
సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ ను ఉపయోగించడం ప్రారంభించిన తరువాత.. 2023 డిసెంబర్ లో పేటీఎం 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అనిశ్చిత పరిస్థితుల మధ్య పేటీఎం ఉద్యోగులు ప్రత్యామ్నాయ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, పేటీఎం తొలగిస్తున్న ఉద్యోగుల సంఖ్య కన్నా.. సంస్థ ను స్వచ్చంధంగా విడిచివెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ఎక్స్ ఫెనో నివేదిక ప్రకారం జాబ్ మార్కెట్లో ప్రస్తుతం పేటీఎం నుంచి 6,000 మందికి పైగా అందుబాటులో ఉన్నారు.