Mobile Tower Fraud : మీ ఇంటిపై మెుబైల్ టవర్ ఏర్పాటు చేస్తే భారీగా డబ్బులు వస్తాయని ఎవరైనా చెబుతున్నారా?
Mobile Tower Fraud : మీ ఇంటిపై మెుబైల్ టవర్ ఏర్పాటు చేస్తామని ఎవరైనా వస్తే జాగ్రత్తగా వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు కొత్త రకం దందా మెుదలుపెట్టారు మోసగాళ్లు. మెుబైల్ టవర్ ఏర్పాటు చేస్తామని డబ్బులు దోచుకుంటున్నారు.
మొబైల్ టవర్ల ఏర్పాటు పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మోసగాళ్లు నకిలీ గుర్తింపులు చూపించి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తామని ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తర్వాత మీ దగ్గర నుంచి కొంత మెుత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. తర్వాత మీరు కాంటాక్ట్ చేయాలని చూసినా.. ఉపయోగం ఉండదు. మీకు అస్సలు దొరకరు. జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.
ఇంటి పైకప్పుపై లేదా మీ ఖాళీ స్థలం లేదా పొలంలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి నెలా సంపాదించాలని మీరు ఆలోచిస్తుంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మొబైల్ టవర్ల ఏర్పాటు పేరుతో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యులను వివిధ రకాలుగా మోసం చేస్తున్నారు నేరగాళ్లు.
మొబైల్ టవర్ ఇన్‌స్టలేషన్ మోసంలో మోసగాళ్ళు వ్యక్తులకు కాల్ చేస్తారు లేదా కలుసుకుంటారు. వారు టెలికాం కంపెనీకి చెందినవారమని, మీ భూమిలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెబుతారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారు మీకు నకిలీ పత్రాలను కూడా చూపించవచ్చు. కానీ టెలికాం కంపెనీలు ఈ విధంగా ప్రజలను నేరుగా సంప్రదించవన్నది వాస్తవం. మీరు ముందుగా కొంత మెుత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలని కూడా చెబుతారు. తర్వాత నెలకు 50 వేలపైనే మీరు సంపాదింవచ్చని మీరు బుట్టలో పడేందుకు ఓ అమౌంట్ చెబుతారు. ఇక మీరు డబ్బులు చెల్లించిన తర్వాత అస్సలు పట్టించుకోరు.
మోసానికి కొన్ని సాధారణ పద్ధతులు
ఫోన్ కాల్స్: మోసగాళ్లు మీకు ఫోన్ చేసి మీ భూమిలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతి లభించిందని, మీకు పెద్ద మొత్తంలో ఇస్తామని చెబుతారు. చాలా సార్లు ఇలాంటి వారు మీ ఇంటికి వచ్చి నకిలీ డాక్యుమెంట్లు చూపించి అవి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు.
ఆన్ లైన్ ఫారాలు : కొన్ని సందర్భాల్లో ఈ మోసగాళ్లు ఆన్ లైన్ ఫారాలు నింపి వ్యక్తిగత సమాచారం అడుగుతారు.
గుర్తుతెలియని వ్యక్తులను నమ్మొద్దు : గుర్తుతెలియని వ్యక్తి మీకు ఫోన్ చేసినా, ఇంటికి వచ్చినా మొబైల్ టవర్ ఏర్పాటు చేస్తానని చెబితే జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు ఒక పత్రాన్ని చూపిస్తే, దానిని జాగ్రత్తగా చదవండి. దాని ప్రామాణికతను చెక్ చేయండి.
టెలికాం కంపెనీని సంప్రదించండి : మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మోసగాళ్లు ఉపయోగిస్తున్న టెలికాం సంస్థను సంప్రదించవచ్చు. మీరు మోసానికి గురయ్యారని భావిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
టెలికాం కంపెనీలు నేరుగా భూ యజమానులను సంప్రదించి స్థానిక యంత్రాంగం, ఇతర సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకోవు. అందుకే ఎలాంటి అడ్వాన్స్ పేమెంట్ చేయకూడదు. అలాగే మీ బ్యాంకు ఖాతా సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దు.