AP High Court: పిల్ ఉద్దేశాలపై ఏపీ హైకోర్టు సందేహం, లక్ష డిపాజిట్ చేయాలని పిటిషనర్‌కు ఆదేశం…
AP High Court: అపార్ట్‌మెంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రయోజనం ఉద్దేశాలపై సందేహాలు వ్యక్తం చేసిన ధర్మాసనం పిటిషన్ తప్పని తేలితే భారీ జరిమానా తప్పదని హెచ్చరించింది.
AP High Court: అపార్ట్మెంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ దురుద్దేశాలతో పిల్ దాఖలు చేశారని ప్రతివాదులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాస్తవాలను ధర్మాసనం ముందుంచాలని చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణలోపు రూ.లక్ష డిపాజిట్ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేవించింది.
విజయవాడ గుణదల గ్రామపంచాయితీ పరిధిలో ఉన్న కార్మెల్‌నగర్ సర్వే నంబర్ 150/2లో నిర్మించిన అపార్టుమెంట్‌కు అనమతులు మంజూరు చేయడంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై బిల్డర్లు అభ్యంతరం వ్యక్తం చేసి, దురుద్దేశాలతో పిల్ దాఖలు చేశారని ధర్మాసనానికి వివరించడంతో పిల్ దాఖలులో దురుద్దేశం ఉందని తేలితే ఖర్చులు విధిస్తామని పిటిషనర్‌ను సీజే హెచ్చరించారు.
పిటిషనర్ భార్యకు అపార్ట్‌మెంట్ ఫ్లాట్ విక్ర యించడానికి నిరాకరించడంతోనే వివాదం మొదలైందని అపార్ట్మెంట్ యజమాని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ధర విషయంలో ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఫ్లాటు ఓనర్లతో పాటు కార్పొరేషన్, మునిసిపల్ అధికారులపై ఆరోపణలు చేస్తూ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యకుడు సత్యనారాయణ పిల్ దాఖలు చేశారనే వాదనలు పరిగణలోకి తీసుకున్న సీజే ధర్మాసనం వాటిని తీవ్రంగా పరిగణించింది.
పిల్ విచారణపై తక్షణం రిజిస్ట్రార్ వద్ద రూ.లక్ష జమ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆ మొత్తాన్ని తగ్గించాలని పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టులో పిల్ దాఖలు చేయడంలో దురు ద్దేశం ఉందని తేలితే కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు భారీగా ఖర్చులు విధిస్తామని హెచ్చరించింది.
అదే సమయంలో కార్మెల్ నగర్‌లో బిల్డర్ వద్ద ఫ్లాటు కొనుగోలు చేయడానికి పిటిషనర్ ప్రయత్నించారని నిరూపించే ఆధారాలను కోర్టులో సమర్పించాలని అపార్ట్మెంట్ యజమాన్యం, ఫ్లాటు ఓనర్ల తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
విజయవాడ గుణదల పరిధిలోని కార్మెల్ నగర్ సర్వే నం.150/2లో నిర్మించిన 90 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్‌కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ సత్య నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గతంలో కూడా ఈ వ్యవహారంలో పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
బిల్డర్లతో తలెత్తిన విభేదాలతో పాటు ఆయన భార్య పేరిట ఫ్లాటు విక్రయించక పోవడంతోనే పిల్ దాఖలు చేశారని అపార్ట్మెంట్ యజమాని, ఫ్లాటు ఓనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తీవ్రంగా స్పందించిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం తక్షణం రూ.లక్ష డిపాజిట్ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది.