MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ వేరియంట్లు- వాటి ఫీచర్స్..
MG Windsor EV price : కొత్తగా లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఈవీని కొనాలని చూస్తున్నారా? అయితే ఈ కొత్త ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వేరియంట్లు, వాటి ఫీచర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ ఎట్టకేలకు విండ్సర్ ఈవీని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .9.99 లక్షలు. సరసమైన ధర, ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ వాహనం కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ మంచి ఆప్షన్‌గా కనిపిస్తుంది. అయితే దీని ధరలో ఒక ట్విస్ట్ ఉంది! బ్యాటరీని కారు బేస్ ప్రైజ్‌లో చేర్చలేదు. బ్యాటరీని రెంట్‌కి తీసుకుంటే కిలోమీటరుకు రూ.3.5 యూసేజ్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రారంభ ఓనర్షిప్ కాస్ట్- బ్యాటరీ వినియోగ ఖర్చుల మధ్య ఆసక్తికరమైన సమతుల్యతను అందిస్తుంది.
విండ్సర్ ఈవీలో బేస్ స్పెక్ వేరియంట్ చూస్తేనే ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై అంచనాలు మరింత పెరుగుతాయి. కాగా మిడిల్-స్పెక్ డ్రైవ్‌కి గణనీయమైన ఆనందాన్ని ఇస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్ పేపర్‌పై నాలుగు లక్షణాలను మాత్రమే జోడిస్తుంది. కానీ అవి కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంజీ విండ్సర్ ఈవీ వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
ఎంజీ విండ్సర్ ఈవీ: ఎగ్జైట్..
ఎంజీ విండ్సర్ ఈవీ బేస్-స్పెక్ వేరియంట్ ఎగ్జైట్ అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది. బేస్ స్పెక్ నుంచే విండ్సర్ ఈవీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 17-ఇంచ్ వీల్స్ పొందుతారు. అయితే ఇవి కవర్లతో కూడిన స్టీల్ వీల్స్! ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ద్వారా ఎక్ట్సీరియర్ డిజైన్‌ను మరింత మెరుగుపరిచింది సంస్థ. క్యాబిన్ లోపల ఫ్యాబ్రిక్ సీట్లు, 60:40 స్ప్లిట్ రేర్ సీట్ ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వైర్ లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, మల్టీ యుఎస్బీ పోర్ట్‌లు, 12వీ పవర్ అవుట్లెట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
వెనుక ప్రయాణీకుల కోసం రేర్ ఏసీ వెంట్లు ఉన్నాయి. అదనపు సౌకర్యం కోసం వెనుక సీటును రిక్లైన్ చేయవచ్చు. 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సౌలభ్యాన్ని పెంచుతాయి. క్రూయిజ్ కంట్రోల్, హిల్ స్టార్ట్, హిల్-డిసెంట్ అసిస్ట్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఆల్-డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు సైతం ఉన్నాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ: ఎక్స్‌క్లూజివ్
ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్.. ఎగ్జైట్ వేరియంట్లోని ఫీచర్స్‌తో పాటు మరిన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్స్, 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్మార్ట్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, లెదర్ సీట్లు, సాఫ్ట్ టచ్ ఫినిష్ ఉన్నాయి. 15.6 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8.8 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సిక్స్ వే అడ్జెస్టెబుల్ పవర్ డ్రైవర్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లో ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎంలు, కప్ హోల్డర్లతో కూడిన రేర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, 360 డిగ్రీల కెమెరా, ఎల్ఈడీ కార్నరింగ్ లైట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎమ్, రేర్ డీఫాగర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ: ఎసెన్స్
ఇది ఎంజీ విండ్సర్ ఈవీ టాాప్ ఎండ్ వేరియంట్. ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్‌లోని ఫీచర్స్‌తో పాటు ఎసెన్స్‌లో మరిన్ని ఫీచర్స్ ఉంటాయి. మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం నైన్ స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టెమ్, పానోరమిక్ గ్లాస్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ లోపల మెరుగైన ఎయిర్ క్వాలిటీ కోసం ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి.
సంబంధిత కథనం