Mahindra XUV 700 EV : మార్కెట్‌లోకి వచ్చేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ రెడీ.. 500 కి.మీ రేంజ్
Mahindra XUV 700 EV : దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా తన కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీకి సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే టాటా మోటార్స్ ప్రస్తుతం ఈ విభాగంలో టాప్ పొజిషన్‌లో ఉంది. తన ఆధిపత్యాన్ని మెుదటి నుంచి కొనసాగిస్తోంది. భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ వాటా 65 శాతంగా ఉంది. ఈ సెగ్మెంట్ ఆధిపత్యం దృష్ట్యా దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా తన కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ వచ్చే సంవత్సరం అంటే 2025 లో లాంచ్ కావచ్చు. ఇటీవల మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ టెస్టింగ్ సమయంలో కనిపించింది. దాని ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను వెల్లడించింది. ఈ ఈవీ ఫీచర్లు, పవర్ట్రెయిన్, డ్రైవింగ్ రేంజ్, బ్యాటరీ గురించి వివరంగా తెలుసుకుందాం.
టెస్టింగ్ సమయంలో గుర్తించిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ ఐసీఈ మోడల్ మాదిరిగానే బయట నుంచి కనిపిస్తుంది. అయితే ఎక్స్‌యూవీ 700 ఈవీ వేరియంట్లలో కొత్త ఫ్రంట్ ఫ్యాషియా లభిస్తుంది. వీటితో పాటు క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, కొత్త లైటింగ్ ఎలిమెంట్స్, రిఫ్రెష్డ్ బంపర్ సెక్షన్లు కూడా ఇందులో ఉండనున్నాయి. అదే సమయంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ సైడ్ ప్రొఫైల్ ఐసీఈ మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సర్క్యులర్ వీల్ ఆర్చ్ లు, క్రోమ్ విండో గార్నిష్, కొద్దిగా స్లిమ్ రియర్ రూఫ్ సెక్షన్ ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ కోసం ఛార్జింగ్ పోర్ట్ ఎడమ వైపు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వెనుక భాగంలో మొత్తం ప్రొఫైల్ ఎక్కువగా ఐసీఈ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అదే సమయంలో టెయిల్గేట్, బంపర్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఇది కాకుండా భద్రత కోసం ఈ ఎక్స్‌యూవీకి ఎల్ 2+ అటానమస్ డ్రైవింగ్, ఏడీఏఎస్ టెక్నాలజీని కూడా ఇవ్వవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీలో ఉపయోగించే మహీంద్రా ఎలక్ట్రిక్ ఐఎన్జీఎల్ఓ ప్లాట్‌ఫామ్ 80 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్లను సపోర్ట్ చేస్తుంది. దీనితో ఈ ఈవీ సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. మునుపటి స్పై చిత్రాలలో డ్యూయల్-మోటార్ ఎడబ్ల్యుడీ ఎంపిక ఉంటుందని చూపిస్తుంది. 175 కిలోవాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌తో వినియోగదారులు కేవలం 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పొందగలరని తెలుస్తోంది.