Health Insurance Rejection : ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి 5 ప్రధాన కారణాలు
Health Insurance Rejection Reasons : ఆరోగ్య బీమా ఉంటే చాలా వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఆరోగ్య బీమా క్లెయిర్ రిజెక్ట్ అవుతుంది. దీనికి చిన్న చిన్న కారణాలే ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఆరోగ్య ఖర్చులకు ఆరోగ్య బీమా ఉత్తమ పరిష్కారంగా చెప్పవచ్చు. అత్యవసర సమయాల్లో ఆరోగ్య బీమా మీకు ఆర్థిక భరోసాను ఇస్తుంది. కానీ చాలా మంది ఇప్పటికీ ఆరోగ్య బీమాకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. బీమా తీసుకున్నా.. కొందరికి చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా పాలసీ క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. చాలా మంది వ్యక్తులు ఇలాంటి కంప్లైంట్స్ చేస్తుంటారు. క్లెయిమ్‌లను తిరస్కరించడానికి గల ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం..
లేట్ ఫైలింగ్
ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను నిర్ణీత గడువులోపు దాఖలు చేయడం మంచిది. గడువులోగా ఫైల్ చేయడం లేట్ అయితే.. మీ క్లెయిమ్ రిజెక్ట్ కావొచ్చు. మీ బీమా సంస్థ నిర్దేశించిన గడువుల గురించి తెలుసుకోవడం, క్లెయిమ్‌ను దాఖలు చేసేటప్పుడు వెంటనే చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. ఎన్ని రోజుల్లోగా క్లెయిమ్ చేయాలో తెలిసి ఉండాలి.
ఆరోగ్య సమస్యలను దాచడం
అధిక ప్రీమియంలు చెల్లించకుండా ఉండేందుకు కొంతమంది తమ గత ఆరోగ్య పరిస్థితులు, రికార్డులను దాచిపెడతారు. అయితే మీరు క్లెయిమ్ ఫైల్ చేసినప్పుడు ఇది మీకు సమస్యగా మారుతుంది. మీరు గత అనారోగ్యాన్ని దాచితే.. కంపెనీ ఆ విషయం తెలుసుకుంటే.. మీ క్లెయిమ్ తిరస్కరించే హక్కు వారికి ఉంటుంది.
తప్పుడు సమాచారం
ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు కొంతమంది వ్యక్తులు వయస్సు, ఆదాయం లేదా వృత్తికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని అందిస్తారు. బీమా కంపెనీ ఈ వ్యత్యాసాన్ని గుర్తిస్తే, అది మీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. క్లెయిమ్‌ల ప్రక్రియ సమయంలో సమస్యలను నివారించడానికి అందించిన మొత్తం సమాచారం ఖచ్చితమైనదని చూసుకోవాలి.
పాలసీ పరిధిలోకి రాని చికిత్సలు
మీ ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా చదవాలి. వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ పాలసీ పరిధిలోకి రాని చికిత్సలు లేదా ఖర్చుల కోసం క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించొద్దు. అలా చేస్తే.. మీ క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. మీ కవరేజీలో చేర్చిన, మినహాయించిన చికిత్సల లిస్ట్ మీరు తప్పకుండా చూసుకోవాలి.
కవరేజ్ పరిమితి
ప్రతి ఆరోగ్య బీమా పాలసీకి నిర్దిష్ట కవరేజ్ పరిమితి ఉంటుంది. మీ క్లెయిమ్ ఈ పరిమితిని మించి ఉంటే బీమా సంస్థ దానిని తిరస్కరించవచ్చు. మీరు క్లెయిమ్‌ల ప్రక్రియలో అవసరమైన డాక్యుమెంటేషన్‌ను అందించడంలో విఫలమైతే కూడా బీమా రాదు.