ఇంట్లోని వీరు బైక్ నడిపితే ఆ కుటుంబానికి 25 వేల రూపాయలు జరిమానా-if this member of the family ride a bike the family will be fined 25 thousand rupees from police heres why ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇంట్లోని వీరు బైక్ నడిపితే ఆ కుటుంబానికి 25 వేల రూపాయలు జరిమానా

ఇంట్లోని వీరు బైక్ నడిపితే ఆ కుటుంబానికి 25 వేల రూపాయలు జరిమానా

Anand Sai HT Telugu
Jul 11, 2024 12:37 PM IST

Bike Ride : మైనర్లు బైక్ నడిపితే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ కుటుంబానికి రూ.25000 జరిమానా విధిస్తున్నారు. పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లి చలానా వేస్తున్నారు.

మైనర్లు బైక్ నడిపితే జరిమానా
మైనర్లు బైక్ నడిపితే జరిమానా

కుటుంబంలో ఎవరైనా మైనర్ సభ్యులు బైక్ లేదా కారు నడుపుతుంటే డ్రైవింగ్ ఆపేయడమే మంచిది. ఎందుకంటే వారి ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మైనర్లు కార్లు, బైకులు నడిపి ప్రాణాలు తీసిన ఘటలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా నోయిడా పోలీసులు కీలక చర్యలు తీసుకుంటున్నారు.

నోయిడా పోలీసులు మైనర్లు డ్రైవింగ్ చేయకుండా నిరోధించడానికి కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. మైనర్లు బైక్ లేదా కారు నడిపితే జరిమానా వేస్తున్నారు. పోలీసులు పరిగెత్తి మరి చలాన్లు జారీ చేస్తున్నారు. నోయిడాలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల డ్రైవింగ్ సమస్య అధికంగా ఉంది. ఈ దృష్ట్యా నోయిడా పోలీసులు ఇటీవల మరోసారి మైనర్లను డ్రైవింగ్ చేయకుండా నిరోధించడానికి కఠినమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ ఇప్పుడు కఠిన వైఖరిని అవలంబించి తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు పిల్లలను డ్రైవింగ్‌కు అనుమతించడం చట్టవిరుద్ధమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

మైనర్ పిల్లలను డ్రైవింగ్ చేయడానికి అనుమతించినందుకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 125 ప్రకారం తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. దీంతోపాటు రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వాహన రిజిస్ట్రేషన్ రద్దు కూడా చేస్తారు. పిల్లల కారణంగా వాహన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తారనే విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి.

డ్రైవింగ్ లైసెన్స్ పై నిషేధం కూడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలుగా ఉన్నవారు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల్లో మైనర్లు డ్రైవింగ్ చేసి అనేక ప్రమాదాలకు కారణమయ్యారు. ఇలాంటి ప్రమాదాలు పిల్లల ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తున్నాయి.

ఎంత పట్టుబట్టినా తమ పిల్లలను తల్లిదండ్రులు డ్రైవింగ్ కు అనుమతించవద్దని నొయిడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతా చట్టాలను అమలు చేయడానికి, రహదారులను అందరికీ సురక్షితంగా మార్చడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

మైనర్లను డ్రైవింగ్ చేయడానికి అనుమతించడం చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా మీ పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని గుర్తుంచుకోండి. సురక్షితంగా ఉండండి, చట్టాలను పాటించండి.

WhatsApp channel