మీ కారు, బైకు వరద నీటిలో మునిగిపోయిందా? ఈ విషయాలు తెలుసుకుని బీమా క్లెయిమ్ చేయండి
Claim Insurance : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది వాహనాలు కూడా నీటిలోనే ఉన్నాయి. కొందరి వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. అయితే వాహనానికి డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? దీనిని ఎలా క్లెయిమ్ చేయాలి?
భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొంగిపొర్లుతున్న నదుల కారణంగా కార్లు కొట్టుకుపోతున్న చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా ఊర్లలో బైకులు కూడా వరదలో కొట్టుకుపోయాయి. భారీ వర్షం సమయంలో మీ కారు, బైకు పాడైపోయినా లేదా ధ్వంసమైనా బీమా పాలసీలు ఎలా వర్తిస్తాయని మీరు తెలుసుకోవాలి.
భారీ వర్షపాతం, వరదలు, విపరీతమైన ప్రమాదాలు, కొండచరియలు విరిగిపడటంలాంటి ఘటనలు మీ వాహనాన్ని దెబ్బతీస్తాయి. మరమ్మతుల సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది. అందుకే ముందుగానే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోరు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీలు మీ వాహనానికి నష్టాన్ని భర్తీ చేస్తాయి. మీ కారు, బైకుల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వాహన బీమా గురించి అవగాహన లేకుంటే ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది.
ఈ తప్పులు చేయకండి
చాలా మంది చేసే అతిపెద్ద తప్పు.. కారులోని నీరు చేరినప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడం చేస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం కారణంగా కారు మరింత పాడవుతుంది. దీంతో బీమా సంస్థలు మీ కారణంగా కారు పాడైందనే వ్యాఖ్యలతో బీమాను ఇవ్వవు. మీ నిర్లక్ష్యంతో వాహనం పాడైందని చెబుతారు. పరిహారం చెల్లించేందుకు తిరస్కరిస్తారు. అందుకే ఇంజిన్‌లోకి నీరు వెళ్తే.. స్టార్ట్ అవుతుందా లేదా అని చూడకూడదు.
బీమా సంస్థ నుంచి ఏజెంట్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా మీరు ముందుగానే కారు నీటిలో మునిగి ఉన్న ఫొటోలు, వీడియోలు, సంబంధిత వార్త కథనాలు ఉంటే వాటిని మీ దగ్గర పెట్టుకోవాలి. వరదలు రావడం, కారు కొట్టుకుపోవడంలాంటివి జరిగిన వెంటనే మీరు కారు ఫొటోలు తీయాలి. ఇవే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
చాలా మంది చేసే మరో తప్పు ఏంటంటే.. కారు వరద నీటిలో మునిగి తేలే వరకూ వెయిట్ చేస్తారు. అలా చేయకూడదు. వెంటనే వాహనం మునిగిన విషయాన్ని బీమా సంస్థకు తెలిజేయాలి. ఇందుకు టోల్ ఫ్రీ నెంబర్లు, మెయిల్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. ప్రస్తుతం చాలా కంపెనీలు వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని తీసుకుంటున్నాయి. కారు చిన్న డ్యామేజ్ అయిన విషయం నుంచి ప్రతిదీ వారికి చెప్పండి. మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత నష్ట పోతారు.
యాడ్ ఆన్ కవర్
నీటి ప్రవేశం కారణంగా ఇంజిన్ పని చేయదు. అయితే చాలా కంపెనీలు మెుత్తం పాలసీలో వీటిని యాడ్ చేయవు. దీనిని సాధారణంగా హైడ్రోస్టాటిక్ లాక్ లేదా హైడ్రోలాక్ అని పిలుస్తారు. చాలా సమగ్ర బీమా పాలసీలు హైడ్రోలాక్‌ను కవర్ చేయవు. ఎందుకంటే ఇది కారు నడిపే వ్యక్తి నిర్లక్ష్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు నీటితో నిండిన వీధి గుండా నడపడానికి ప్రయత్నిస్తుంటే దీని ఫలితంగా ఇంజిన్‌లోకి నీరు చేరి అది పాడైపోయే అవకాశం ఉంది. కొన్ని బీమా కంపెనీలు ఇటువంటి పరిస్థితుల కోసం రూపొందించిన యాడ్-ఆన్ కవర్‌లను అందిస్తాయి.
అనుబంధ పాలసీలు
ప్రాథమిక వాహన బీమాతో కారు నష్టానికి బీమా చెల్లించకపోవచ్చు. కొన్ని అనుబంధ పాలసీలు ఉంటాయి. అవి మీ వాహనానికి ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ అనేది కారు నీటిలో మునిగిపోయినప్పుడు ఇంజిన్‌కు జరిగిన నష్టానికి ఈ అనుబంధ పాలసీ నష్టపరిహారాన్ని ఇస్తుంది. రిటర్న్ టూ ఇన్వాయిస్ అనుబంధం పాలసీ వాహనం వాడకుండా పాడైన సమయాల్లో వర్తిస్తుంది. ఇలా చాలా రకాల అనుబంధ పాలసీలు ఉంటాయి.
వరద నీటిలో కొట్టుకుపోతే
మీ వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు బీమా కంపెనీ నుంచి సర్వేయర్ వస్తారు. మీ దగ్గర నష్టానికి సంబంధించి ఉన్న పూర్తి సమాచారం అతడికి షేర్ చేయాలి. కారు లేదా బైకుకు సంబంధించిన ఖర్చు వివరాలను చూసి ఇన్సూరెన్స్ కంపెనీకు తెలియజేస్తారు. కారు వరద నీటిలో కొట్టుకుపోయినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సంబంధిత ఎఫ్ఐఆర్ కాపీని బీమా సంస్థకు అందించాలి. వారు దీనిపై ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుంది.
సాక్ష్యాలు ఉండాలి
పకృతి వైపరీత్యాలతో మీ వాహనం నష్టపోతే బీమాను క్లెయిమ్ చేసందుకు నష్టానికి సంబంధించిన సాక్ష్యాలు ఉండాలి. సంఘటన స్థలం నుంచి వాహనాన్ని తరలించకూడదు. వెంటనే బీమా సంస్థకు చెప్పాలి. రిపోర్ట్ ఆధారంగా బీమా సంస్థ క్లెయిమ్ ఆమోదిస్తుంది. మీ పాలసీ స్వభావం ఆధారంగా క్లెయిమ్ వస్తుంది.