దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రధాన నగరంలో బంగారం ధర భిన్నంగా ఉంటుంది. రాష్ట్రాల పన్ను రేటుతో పాటు, అనేక ఇతర విషయాలు దీనితో ముడిపడి ఉన్నాయి. బంగారంపై వన్ నేషన్ వన్ ప్రైస్ పాలసీ త్వరలోనే అమల్లోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత బంగారం ధరలు అన్ని చోట్లా ఒకేలా ఉంటాయి. ఏ రాష్ట్రంలోకి వెళ్లినా ఒకే విధంగా బంగారం ధరలు ఉండనున్నాయి. ఈ విధానానికి జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న బడా నగల వ్యాపారులంతా అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ అనేది భారతదేశంలో రత్నాలు, ఆభరణాల వాణిజ్యాన్ని ప్రోత్సహించే జాతీయ వాణిజ్య సమాఖ్య. ఇది వాణిజ్య పద్ధతులు, వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా జెమ్ అండ్ జువెలరీ వన్ నేషన్ వన్ రేట్ విధానానికి ఓకే చెప్పింది.
2024 సెప్టెంబర్‌లో జరిగే సమావేశంలో ఈ విధానంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విధానాన్ని అమలు చేయడానికి, ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి బంగారం పరిశ్రమ కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది.
దేశవ్యాప్తంగా ఒకే రకమైన బంగారం ధరలను అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకం ఇది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ మూలన అయినా ఒకే ధరకు బంగారాన్ని కొనుగోలు చేసి అమ్ముతారు.
ఇందుకోసం ప్రభుత్వం నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయనుంది. బంగారం ధరను ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా నిర్ణయిస్తారు. దీని ద్వారా నగల వ్యాపారులు నిర్ణీత ధరకు బంగారాన్ని విక్రయిస్తారు.
ఈ విధానం అమలుతో మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుంది. బంగారం ధరల్లో వ్యత్యాసం తగ్గడంతో దాని ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు బంగారంపై ఇష్టానుసారంగా ధరలు వసూలు చేసే ధోరణికి అడ్డుకట్ట పడనుంది.
ఈ పాలసీ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకే రేటు బంగారం ఉండటం ద్వారా, వినియోగదారులందరికీ ఒకే ధరకు ఆభరణాలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఒకే రేటు ఉండటం వల్ల బంగారం మార్కెట్ మరింత మెరుగ్గా ఉంటుంది. దీనికితోడు రాష్ట్రాల్లో వేర్వేరు ధరల కలయిక కారణంగా బంగారం ధర తగ్గే అవకాశం ఉంది. ఇది బంగారు పరిశ్రమలో న్యాయమైన పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుంది.