SMS Without SIM : ఫోన్‌లో సిమ్ కార్డ్ లేకుండానే మెసేజ్‌లు పంపొచ్చు.. అద్భుతమైన ఫీచర్
Message Without SIM : రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుంది. టెలికాం కంపెనీలు సైతం కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నాయి. ఫోన్‌లో సిమ్ కార్డు లేకుండానే మెసేజ్‌లు పంపే ఫీచర్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకువస్తుంది.
టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బిఎస్ఎన్ఎల్) ఇటీవల కొత్త సేవను పరీక్షించడం మెుదలుపెట్టింది. దీని సాయంతో యూజర్లు సిమ్ కార్డు లేకుండానే మెసేజ్‌లు పంపుకొనే వెసులుబాటు లభిస్తుంది. సిమ్ కార్డును ఉపయోగించలేక, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎక్కడైనా చిక్కుకుపోయిన వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొత్త సేవ గురించి పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ సేవ ఏదో ఒక రకమైన ఉపగ్రహ ఆధారిత డైరెక్ట్ టు డివైజ్(D 2 D) టెక్నాలజీ ద్వారా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా మీ డివైజ్ నేరుగా శాటిలైట్ నెట్ వర్క్‌కు కనెక్ట్ అయి సిమ్ కార్డు లేకుండానే ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు.
ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 కార్యక్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తన కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. మెరుగైన కనెక్టివిటీని అందించడానికి శాటిలైట్, మొబైల్‌లను కలపడం ద్వారా ఈ టెక్నాలజీ పని చేస్తుందని, కనెక్టివిటీ సొల్యూషన్‌గా కొత్త డైరెక్ట్-టు-డివైజ్ సేవను అభివర్ణించారు. దీన్ని వయాశాట్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు.
ఐఎంసీ 2024 ఈవెంట్‌లో బీఎస్ఎన్ఎల్ తన డెమోను చూపించింది. నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్ (ఎన్టీఎన్) కనెక్టివిటీ ఉన్నప్పటికీ వయాశాట్ ఉపగ్రహాలు 36,000 కిలోమీటర్ల దూరంలో ఎస్ఎంఎస్‌లను పంపగల వాణిజ్య ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఈ ట్రయల్‌లో కంపెనీ ఉపయోగించింది. ఐఫోన్లు, ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో కనిపించే శాటిలైట్ కనెక్టివిటీ మాదిరిగానే అత్యవసర పరిస్థితుల్లో డీ2డీ ద్వారా సహాయం పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్‌తో పాటు భారత టెలికాం మార్కెట్లోని టాప్ కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) కూడా శాటిలైట్ కనెక్టివిటీ సేవలపై పనిచేస్తున్నాయి.