Office Chair : వాట్ ఎన్ ఐడియా బ్రో.. ఆఫీసు కుర్చీని ఆటోరిక్షాకు పెట్టేసిన డ్రైవర్
Viral News : ఆఫీస్ కుర్చీలో కూర్చోవడం అంటే కొందరికి చిరాకు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఆఫీస్ కుర్చీనే తన ఆటోకు సెట్ చేయించుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
సాధారణంగా ఆటోరిక్షా డ్రైవర్లు కంపెనీ ఇచ్చే సీట్లపై కూర్చుని ఆటో నడపడం చూస్తుంటాం. కొందరు కాస్త మోడిఫై చేసి నాణ్యమైన కుషన్ సీటును ఉపయోగిస్తారు. లేదంటే కంఫర్ట్‌గా ఉండేందుకు కొన్ని మార్పులను చేస్తారు. కానీ ఇక్కడ ఓ ఆటోడ్రైవర్ ఆఫీసు కుర్చీని ఆటోకు వాడడం వైరల్‌గా మారింది. ఇటీవల india is not for beginners అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇలాంటి ఆలోచనలతో ఉంటాం కాబట్టి అలా అంటుంటారు..
ఆఫీసు కుర్చీని ఆటోకు పెట్టిన వ్యక్తి బెంగళూరుకు చెందిన డ్రైవర్. బెంగళూరులో ఇలాంటి విషయాలు ఇటీవలికాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా విషయాలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడి ఆటో డ్రైవర్లు కూడా కొన్ని విషయాల్లో కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇటీవల ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్‌లోని క్యూఆర్ కోడ్‌ని చూపించి రైడ్‌కు డబ్బులు చెల్లించమని అడిగాడు. ఇప్పుడు ఆఫీసు కుర్చీని ఆటోకు పెట్టిన వ్యక్తి కూడా వైరల్ అవుతున్నాడు.
ఆటో డ్రైవర్ తన ఆటో ఒరిజినల్ సీటును మార్చి ఆఫీస్ తరహా కుర్చీని సీటుగా వాడుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. సోషల్ మీడియా ఎక్స్ యూజర్ శివాని ముట్లపూడి అనే వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఆటో డ్రైవర్ ఆఫీసు కుర్చీని ఉపయోగించి సీటును సిద్ధం చేశాడు. ఇదే విషయాన్ని ఆమె షేర్ చేసింది. ఐ లవ్ బెంగళూరు అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ తన వాహనాన్ని ఇంతగా అప్‌గ్రేడ్ చేశారని జనాలు మాట్లాడుకుంటున్నారు.
అయితే శివాని షేర్ చేసిన పోస్టులో ఆమెపై కూడా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఆమెను బెంగళూరు అందం అంటూ కామెంట్ చేశాడు. ఆఫీసు కుర్చీలు ఎక్కువసేపు కూర్చోవడానికి రూపొందించారు. కానీ ఆటో డ్రైవర్ దానిని తనకు అనుకూలంగా మలచుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని మరొకరు అన్నారు.
మరొక వినియోగదారుడు హాహా బ్యాక్ హెల్త్ కేర్ మ్యాక్స్ అని రాశారు. తనకు వెన్ను సమస్య ఉన్నట్టుందని కామెంట్స్ చేస్తున్నారు. అట్లాసియన్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న AI చీఫ్ డిజైనర్ డేవిడ్ హాంగ్ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. దీన్ని చూసేందుకు త్వరలో బెంగళూరు వెళతానని చెప్పారు.
కొంతమంది మాత్రం ఈ కుర్చీపై కూర్చోవడం అంత మంచిది కాదని చెప్పారు. ఇది బహుశా మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని అంటున్నారు. ఇందులోని ప్రతి భాగం భద్రత పరంగా ప్రత్యేకంగా ధృవీకరిస్తారు. చట్ట ప్రకారం తప్పు అయ్యే ఛాన్స్ ఉందని జర్మన్ ట్రక్ తయారీ సంస్థ డిజైన్ విభాగంలో పనిచేసిన ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.