Apple store: త్వరలో బెంగళూరులో కూడా ఆపిల్ ఎక్స్ క్లూజివ్ రిటైల్ స్టోర్ ప్రారంభం; ఢిల్లీ, ముంబై తరువాత ఇక్కడే
Apple exclusive retail store: ఆపిల్ సంస్థ భారత్ లో తన ఎక్స్ క్లూజివ్ స్టోర్స్ ను క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ, ముంబైలలో తమ ఎక్స్ క్లూజివ్ రిటైల్ స్టోర్స్ ను ప్రారంభించిన ఆపిల్ త్వరలో.. బెంగళూరులో కూడా ఆపిల్ ఎక్స్ క్లూజివ్ రిటైల్ స్టోర్ ను ప్రారంభించనుంది.
Apple exclusive retail store: బెంగళూరులో త్వరలోనే ప్రత్యేకమైన ఆపిల్ రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ సహా వివిధ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీదారు అయిన ఆపిల్ తమ ఢిల్లీ, ముంబై స్టోర్ల విజయం తరువాత తాజాగా బెంగళూరులో ఆపిల్ ఎక్స్ క్లూజివ్ రిటైల్ స్టోర్ ను ప్రారంభిస్తోంది. త్వరలో దేశంలో మరో మూడు ఎక్స్క్లూజివ్ రిటైల్ స్టోర్లను తెరవాలని యోచిస్తోంది.
ముంబైలో మరొకటి..
బెంగళూరుతో పాటు, ఆపిల్ పూణే, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో కొత్త రిటైల్ స్టోర్ల ను తెరవాలని ఆపిల్ భావిస్తోంది. ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డియర్డ్రే ఓ'బిరెన్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, ఐఫోన్-16ను భారత్ లోనే తయారు చేస్తున్నట్లు ఆపిల్ తెలిపింది. ఐఫోన్ (iphone) 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ తో సహా మొత్తం ఐఫోన్ 16 లైనప్ ను ఆపిల్ ఇప్పుడు భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తోందని ఆపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు ప్రామాణిక ఐఫోన్ మోడళ్లను మాత్రమే భారత్ లో తయారు చేసేవారు. ఉదాహరణకు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. మొదలైనవి. కాగా, ఆపిల్ 2017 లో భారతదేశంలో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది.
ఢిల్లీ, ముంబైలలో
ఏప్రిల్ 2023 లో, న్యూఢిల్లీ, ముంబైలో రెండు ఆపిల్ (apple) ఎక్స్ క్లూజివ్ స్టోర్లను ప్రారంభించారు. మొదటి సంవత్సరంలో ఈ స్టోర్స్ లో రూ. 190-210 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఈ స్టోర్స్ తెరిచినప్పటి నుంచి నెలకు సగటున రూ.16-17 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. భారత మార్కెట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ (smartphone) మార్కెట్ కావడంతో ఆపిల్ భారత్ పై తన దృష్టిని మళ్లిస్తోంది. ముంబై స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆపిల్ సీఈఓ కూడా హాజరయ్యారు.