Amazon: అమెజాన్ లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ ఇస్తే.. తోడుగా పెద్ద బల్లిని కూడా గిఫ్ట్ గా పంపించారు..
Amazon: ఒక అమెజాన్ కస్టమర్ కు భయానక అనుభవం ఎదురైంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో ఒక ఎయిర్ ఫ్రైయర్ ను ఆర్డర్ ఇస్తే, ఆమెకు ఆ ఎయిర్ ఫ్రైయర్ తో పాటు, అదే ప్యాక్ లో ఒక పెద్ద సైజ్ బ్రతికి ఉన్న బల్లిని కూడా పంపించారు. ప్యాక్ ఓపెన్ చేసి ఆ బల్లిని చూసి ఆమె తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Amazon: అమెజాన్ నుంచి వచ్చిన పార్శిల్ ను ఓపెన్ చేసిన ఓ మహిళ షాక్ కు గురైంది. ఆ పార్శిల్ లో ఆమె తాను ఆర్డర్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ తో పాటు ఒక బ్రతికి ఉన్న బల్లిని కూడా చూసి భయపడిపోయింది. ఈ విషయాన్ని ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అమెజాన్ దే బాధ్యత
ఎక్స్ యూజర్ సోఫియా సెరానో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి ఎయిర్ ఫ్రైయర్ ను ఆర్డర్ చేశారు. ఆమెకు ఆ ఎయిర్ ఫ్రైయర్ తో పాటు, అదే పార్శిల్ లో భారీ సైజ్ లో ఉన్న లైవ్ బల్లి కూడా వచ్చింది. ఈ విషయాన్ని వీడియో సహా ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన అమెజాన్ ఆమెను క్షమాపణలు కోరింది. సెరానో తన ఎక్స్ పోస్ట్ లో ఇలా రాశారు. ‘‘మేము అమెజాన్ ద్వారా ఎయిర్ ఫ్రైయర్ ను ఆర్డర్ చేసాము. అయితే, అది ఒంటరిగ రాలేదు. ఒక తోడును తీసుకువచ్చింది. ఇది అమెజాన్ తప్పో లేక క్యారియర్ తప్పో నాకు తెలియదు’’ అని ఆమె రాశారు. ‘‘ఎయిర్ ఫ్రైయర్ ప్యాక్ చేసిన బ్యాగులోనే ఆ భారీ సరీసృపాన్ని ఉంచినందున, అది @amazon బాధ్యత అని మాకు తెలుసు. అయితే, @amazon బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడదు’’ అని కూడా ఆమె రాశారు. ఆ పోస్ట్ తో పాటు బాక్సులో ఉన్న బల్లి ఫొటోను కూడా షేర్ చేశారు.
ఎక్స్ పోస్ట్ వైరల్..
జులై 18న ఎక్స్ లో ఈ పోస్ట్ పెట్టారు. పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ పోస్ట్ 4.1 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ పోస్ట్ కు అనేక లైకులు, కామెంట్లు కూడా ఉన్నాయి. అమెజాన్ (amazon) కూడా ఈ పోస్టుకు కామెంట్స్ సెక్షన్లో 'హలో! అసౌకర్యానికి క్షమించండి. మీ ఆర్డర్ ను అమెజాన్ .com, .com.mx లేదా .esలలో.. దేని నుంచి కొనుగోలు చేశారో మాకు చెప్పగలరా?’’ అని అమెజాన్ ప్రశ్నించింది. ‘‘అది ఎక్కడి నుండి వచ్చింది? సింగపూర్ నుంచి? సింగపూర్ లో అలాంటివి ఉంటాయి. అక్కడ వాటిని వీధుల్లో చూడటం చాలా సాధారణం’’ అని మరో యూజర్ స్పందించాడు. ‘‘నాకు ఇలా జరిగితే నేను కచ్చితంగా చనిపోయేదాన్ని. మరోవైపు, పాపం ఆ చిన్న సరీనృపం ఈ జర్నీలో ఎంత భయపడిపోయి ఉంటుంది’’ అని మరో ఎక్స్ యూజర్ పౌలీనా మెజియా కామెంట్ చేశారు.