Mekapati Vikram : ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకపాటి విక్రమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి బాధ్యతలు చేపట్టారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసన సభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన మేకపాటి విక్రమ్ రెడ్డి శాసన సభ్యునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ సోమవారం తన ఛాంబరులో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.
2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసన సభ నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా విధులను నిర్వహించే మేకపాటి గౌతమ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21 న గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన నేపథ్యంలో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు జూన్ 23 న ఆత్మకూరు శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నిక నిర్వహించారు.
ఎన్నికల్లో మేకపాటి గౌతమరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఉప ఎన్నికలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేశారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. శాసన సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన సందర్బంగా శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మేకపాటి విక్రమ్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గీయ మేకపాటి గౌతమ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చుకోవాలని, వారి ఆశయాల సాధనకు, ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్దికి అహర్నిశలు కృషి చేయాలని ఆంకాంక్షించారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత విక్రమ్ రెడ్డికి శాసనసభా వ్యవహారాలు, నియమ నిబంధనల పుస్తకాలను అందచేశారు. మేకపాటి విక్రమ్ ప్రమాణ స్వీకారానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి, మాజీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు శుభాకాంక్షలు తెలిపారు.
టాపిక్