Posani On Purandeswari : బాలకృష్ణ ఇద్దర్ని కాల్చేస్తే పురందేశ్వరి వైఎస్ కాళ్లపై పడ్డారు- పోసాని సంచలన వ్యాఖ్యలు
Posani On Purandeswari : పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ పై విమర్శలు మొదలుపెట్టారని పోసాని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
Posani On Purandeswari : టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని ప్రధాని మోదీనే చెప్పారని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ ను తిట్టడం మొదలుపెట్టారన్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే పురందేశ్వరి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారని గుర్తుచేశారు. ఈ కేసులో చంద్రబాబు అసలు తప్పులేదని, స్కిల్ సెంటర్స్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేశారని పురందేశ్వరి చెప్పుకొస్తున్నారన్నారు. పురందేశ్వరి వ్యాఖ్యలపై పోసాని మండిపడ్డారు. బాలకృష్ణ రివాల్వర్ తో ఇద్దరిని కాల్చారన్నారు. బాలకృష్ణ భయపడి పురందేశ్వరి దగ్గరికి ఏడుస్తూ వచ్చారని పోసాని ఆరోపించారు. పురందేశ్వరి, వెంకటేశ్వరరావు ఇద్దరూ వైఎస్ఆర్ దగ్గరికి వచ్చి ఆయన కాళ్లపై పడ్డారని, దీంతో బాలయ్యను వైఎస్సార్ కాపాడారన్నారు.
బీజేపీ ఓడిపోతే మరో పార్టీకి వెళ్తారా?
ఎన్ని సార్లు, ఎన్ని పార్టీలు మారుతారు మేడమ్ అంటూ పురందేశ్వరిపై పోసాని కృష్ణ మురళి సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ మద్యపానం నిషేధిస్తే, చంద్రబాబు నిషేధం ఎత్తివేసి మద్యాన్ని ఏరులై పారించారన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి చంపేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కూతురిని అని చెప్పుకుని కాంగ్రెస్ లో చేరారన్నారు. కాంగ్రెస్ ఓడిపోగానే బీజేపీలో చేరారన్నారు. బీజేపీ ఓడిపోతే మళ్లీ మరో పార్టీలోకి వెళ్తారని ఎద్దేవా చేశారు. ఓదార్పు యాత్రకు సోనియా గాంధీ అనుమతి ఇవ్వకపోతే జగన్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారన్నారు. దేశంలో రాజకీయాలు ఉన్నంత కాలం వైఎస్ఆర్ పేరు నిలిచి ఉంటుందన్నారు. సీఎం జగన్ ను ముట్టుకుంటే కాలిపోతారని పోసాని కృష్ణ మురళి హెచ్చరించారు.
బీజేపీ దోమంత ప్రేమ కూడా లేదు
చంద్రబాబు అవినీతిపరుడని పురందేశ్వరి భర్తతో పాటు, ఎన్టీఆర్, ప్రధాని మోదీ చెప్పారని పోసాని గుర్తుచేశారు. చంద్రబాబు దగ్గరి బంధువు కాబట్టి ఆయన అరెస్టు కాగానే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారని ఆరోపించారు. కక్షగట్టి చంద్రబాబును అరెస్ట్ చేశారని అవాస్తవాలు ప్రచారం చేస్తు్న్నారన్నారు. బాలకృష్ణ కాల్పులకు పాల్పడిన ఘటనలో పురందేశ్వరి వైఎస్ కాళ్లపై పడ్డారన్నారు. తమ్ముడికో న్యాయం, మిగతా వారికో న్యాయమా? అని పోసాని ప్రశ్నించారు. పురందేశ్వరికి బీజేపీపై దోమంత కూడా ప్రేమ లేదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు కేడీ నెంబర్ వన్, గూంఢా, అవినీతిపరుడని ఇంత మంది చెప్పినా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ మీద అనుమానంగా ఉందని పురందేశ్వరి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఐడీ మీద డౌట్ తప్ప కేడీ మీద డౌట్ లేదా? అని ప్రశ్నించారు. పురందేశ్వరి ఎప్పుడూ అవినీతిపరులకు సపోర్ట్ చేస్తారని మండిపడ్డారు.