Passenger Train : రాజమండ్రికి డైలీ ప్యాసింజర్ రైలు
Passenger Train ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ-రాజమండ్రి మధ్య వారానికి రెండు రోజులు నడుస్తున్న ప్యాసింజర్ రైలును డైలీగా మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరోవైపు ప్రయాణికులకు భద్రత కల్పించడంలో భాగంగా సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఇకపై ఎల్‌హెచ్‌బి కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
Passenger Train విజయవాడ-రాజమండ్రి మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైలును డైలీగా మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 07459 విజయవాడ- రాజమండ్రి ప్యాసింజర్ రైలు ప్రస్తుతం సోమ, మంగళవారాల్లో మాత్రమే నడుస్తోంది. ఈ రైలు ఇకపై డైలీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
ట్రైన్ నంబర్ 07460 రాజమండ్రి-విజయవాడ ప్యాసింజర్ రైలు మంగళ, బుధవారాల్లో ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉండగా ఇకపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రోజూ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ట్రైన్ నంబర్ 07978 విజయవాడ-బిట్రగుంట ప్యాసింజర్ గతంలో శుక్రవారం మినహా ప్రతి రోజు ప్రయాణించేది. ఇకపై ఈ రైలును డైలీ నడుపున్నారు.
ట్రైన్ నంబర్ 07977 బిట్రగుంట -విజయవాడ ప్యాసింజర్ రైలు కూడా ఇకపై రోజు ప్రయాణించనుంది. కరోనా నేపథ్యంలో రద్దైన ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను పూర్తి స్తాయిలో పునరుద్దరించగా డీజిల్, ఎలక్ట్రికల్ పుష్ పుల్ రైళ్లతో నడిచే ప్యాసింజర్ రైళ్లను కూడా దశల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
తక్కువ దూరం ప్రయాణాలకు ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నయ రవాణా సాధనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం హైస్పీడ్ రైల్లకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ప్యాసింజర్ సర్వీసులపై ఆధారపడిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సింహపురి ఎక్స్‌ప్రెస్‌కు ఎల్‌హెచ్‌బి కోచ్‌లు….
ట్రైన్ నంబర్ 12710 సికింద్రబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలుకు లింక్డ్ హాఫ్‌మెన్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు జనరల్ బోగీలతో పాటు 9 స్లీపర్ కోచ్‌లు, త్రీటైర్ ఏసీ కోచ్‌లు 5, టూటైర్ ఏసీ కోచ్‌లు 2, ఫస్ట్ ఏసీ 1 కోచ్ ఏర్పాటు చేస్తారు.